ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే రూ. 500 గిఫ్ట్ ప్యాక్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే నవ దంపతులకు రూ. 500 రూపాయల గిఫ్ట్ ప్యాక్ ఆర్టిసి తరపున ఇస్తామని డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం డిపో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుస్నాబాద్ బస్సు డిపో లాభాల్లో నడుస్తోందని తెలిపారు. జూన్ 1 నుండి 6 వరకు 2 లక్షల 12 వేల రూపాయల లాభం డిపోకు సమకూరినట్లు వెల్లడించారు. హుస్నాబాద్ డిపో పరిధిలో 20 మంది ఆర్టీసీ విలేజ్ ఆఫీసర్లను నియమించనున్నామని, ఈనెల 9 వ తేదీన వారికి బాధ్యతలు అప్పగించి ప్రత్యేకమైన కిట్లను అందించడం జరుగుతుందన్నారు. గ్రామ సర్పంచులు, ప్రజలతో మమేకమై ఆర్టీసీ తరపున సేవలను ఎప్పటికప్పటికీ తెలియజేస్తామని అన్నారు.