
భువనగిరి మండలంలోని వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్లు పోయే రాచ కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని రాచ కాల్వ పనులను సీపీఐ(ఎం) నాయకత్వం, రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహంగీర్ హాజరై, మాట్లాడారు. వర్షాకాలం నెత్తిమీదికి కొచ్చిన ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. కాల్వ పక్కన ఉన్న రైతులు కాలువ తీస్తుంటే తమ పంట పొలాలు ధ్వంసం అయ్యాయని వాటికి నేటికీ ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్వ పనులు పూర్తి కావడానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు కాలువలు దాటి తమ పంట పొలాలకు పొలాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యామ్నాయ బాటలు కూడా లేవని ఇప్పటికైనా కాల్వపైన 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని, కాల్వ మధ్యలో ఉన్న మట్టి కుప్పలను తక్షణం తొలగించాలని జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈవారం లోపు పనులు చేపట్టకపోతే రైతులను సమీకరించి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, నాయకులు బండి శ్రీను, రైతులు పన్నాల సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, సత్తిరెడ్డి, హరినాధ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మద్దుల ప్రభాకర్ రెడ్డి, సోమ అంజయ్య, చందుపట్ల ఎల్లయ్య, మల్లేష్, కసర బోయిన శ్రీనులు పాల్గొన్నారు.