– తవ్వుకున్న గోతిలో తానే పడ్డ గులాబీ పార్టీ
– కాంగ్రెస్ గెలువొద్దని ఓట్లను మళ్లించారనే విమర్శలు
– కారు పార్టీకి చరిత్రలో తొలిసారి రిక్తహస్తం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ పెరగడానికి బీఆర్‌ఎస్ సహకరించిందా? అందులో భాగంగానే పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ చేయించిందా? తాను గెలువకపోయినా సరేగానీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలువ్వొద్దనే బీఆర్‌ఎస్ నేతల ఎత్తుగడ ఆ పార్టీ మనుగడకే ఇబ్బందికరంగా మారబోతున్నదా? అధికారంలో ఉన్నప్పుడు..ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చాక ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ఎదుగుదలకు బీఆర్‌ఎస్ సహకరిస్తోందా?రాజకీయ విమర్శకులు అన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి గతంతో పోలిస్తే ఓట్‌షేరింగ్, సీట్ల సంఖ్య పెరగడానికి బీఆర్‌ఎస్‌నే కారణమని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ లోక్‌సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదేతొలిసారనీ, దీనికి ఆ పార్టీ స్వయంకృపరాధమే కారణమనే పొలిటికల్ చర్చ జరుగుతున్నది.
ఇద్దరి మధ్య కొట్లాట మూడొగనికి సందు అన్నట్టుగా.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రానివ్వద్దనే బీఆర్‌ఎస్ ఆరాటం అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూర్చి పెట్టింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్లడంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలనే బీఆర్‌ఎస్ నేతల లక్ష్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గెలుపునకు దోహదపడినది. వాస్తవానికి ఆ నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీ గెలిచిన విషయం విదితమే. ఆ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావుకు కేవలం లక్షా 29 వేల ఓట్లే దక్కాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన మెజార్టీల్లో కూడా సగం ఓట్లు పడలేదంటనే ఎంత పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అది ఆ పార్టీకి సానుకూల అంశం. కానీ, నామినేషన్లు వేసిన దగ్గర నుంచే ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఈటలకు అంతర్గతంగా సహకరించారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అది ఫలితాల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఉద్యమకారుడనే సానుకూలత ప్రజల్లో ఉండటం ఈటలకు కలిసొచ్చింది. దీంతో అతనికి 3,91,475 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. వాస్తవానికి ఆ ఎంపీ పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, కంటోన్మెంట్ అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. వారందరికీ కలిపి 9.5 లక్షల ఓట్లు దక్కాయి. ఇప్పుడు అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థికి కేవలం మూడు లక్షల ఓట్లే వచ్చాయి. దీనిని బట్టే బీఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున క్రాస్‌ఓటింగ్ జరిగినట్టు అర్ధమవుతున్నది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోనూ అదే తంతు జరిగింది. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలో నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలున్నారు. మొత్తం ఏడు సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌కు 707456 ఓట్లు లభించాయి. అదే బీజేపీ అభ్యర్థులకు 3.40 లక్షల వరకు ఓట్లు దక్కాయి. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 8,09,882 ఓట్లు దక్కగా బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు కేవలం 1, 78,968 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టే క్రాస్ ఓటింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు.
అతన్ని ఎలాగైనా ఓడగొట్టాలనే కొండాకు సపోర్టు చేశారనీ, అక్కడ కాసాని నామమాత్రంగానే బరిలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్ అసెంబ్లీ స్థానం మినహా అన్నీ బీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. మాజీ సీఎం, మాజీ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాలు ఈ నియోజకవర్గ పరిధిలోనివే. అక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. కొందరు బీఆర్‌ఎస్ నేతలు గులాబీ కండువాలు కప్పుకుని బీజేపీ ఓట్లు వేయించారనే విమర్శలు కూడా వచ్చాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం ఉండటంతో అక్కడ ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో అక్కడా బీఆర్‌ఎస్ ఓటింగ్‌ను బీజేపీ వైపు మళ్లించారనే చర్చ నడుస్తున్నది. మిగతా నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ క్రాస్ ఓటింగ్ చేయించందనే విమర్శ ఉంది. అంతిమంగా బీఆర్‌ఎస్ క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ లాభపడింది. పెద్దపాము చిన్నపామును మింగేస్తుందనే సామెత భవిష్యత్తు కాలంలో బీఆర్‌ఎస్‌కు వర్తిస్తుందనీ, బీజేపీ ఎత్తుగడలతో బీఆర్‌ఎస్ మరింత చతికిల పడటం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.