– ఎమ్మెల్యేలుగా ఓడి…
– ఎంపీలుగా గెలిచిన నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అక్కడ చెల్లని రూపాయి… ఇక్కడ చెల్లుతుందా? అని ఎవరైనా అడిగితే…అవును చెల్లుతుంది అనే చెప్పాలేమో! ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు, ఇప్పుడు ఏకంగా ఎంపీలుగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కూడా గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీచేసి, ఓడిపోయి, మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సీన్ మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో మళ్ళీ రిపీట్ అయ్యింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీచేసి, రెండుచోట్లా ఓడిపోయిన ఈటల రాజేందర్…తాజాగా మల్కాజ్‌గిరి ఎంపీగా 2.8 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అలాగే కరీంనగర్ ఎంపీగా ఉండి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన బండి సంజరు, బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. కానీ తాజా ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మరోసారి 2.12 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజరు చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అదే నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని 1.13 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి ఓటమిపాలైన రఘునందన్‌రావు, ఇప్పటి ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయన ఇక్కడి పోటీలో మూడోస్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి జీ కిషన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. దానం నాగేందర్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా సిట్టింగ్ స్థానాల్లో ఉంటూ, ఓటమిపాలైన నేతలు కొందరైతే, ఓడి గెలిచిన నేతలు మరికొందరు. అందుకే చిల్లు కాసులు కూడా ఎక్కడోచోట చెల్లుబాటవుతాయంటే ఇదేనేమో!.