మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు నిరాశ

– సీఎం సొంత జిల్లాలో ఓటమి.. బీజేపీ అభ్యర్థి డికె.అరుణ విజయం
– నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి గెలుపు
నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పార్లమెంట్‌ నియోజకవర్గాల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కో స్థానం గెలుపొందాయి. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవలేదు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశతో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్‌ ఓడిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అభ్యర్థి ప్రకటన నుంచి అనేక ప్రచార సభల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుపై జరుగుతున్న కుట్రను సీఎం రేవంత్‌రెడ్డి తెలియజేసినా ఆ పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో బీజేపీ అభ్యర్థి డికె.అరుణ విజయం సాధించారు. బొటాబోటీ మెజార్టీతో గెలిచినా.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. మహబూబ్‌రగర్‌ పార్లమెంటులో మొత్తం ఓటర్లు 16లక్షల 82 వేల 470 మంది ఉన్నారు. 12 లక్షల 82వేల 470 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 5,06,747 ఓట్లు, కాంగ్రెస్‌ నుంచి వంశీచంద్‌రెడ్డికి 5,03,111 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నెశ్రీనివాస్‌రెడ్డికి 1,54,792 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 3636 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి క్రాస్‌ అయినట్టు ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్‌ ఫెయిలైంది.నాగర్‌కర్నూల్‌ పార్లమెంటులో మొత్తం ఓటర్లు 17లక్షల 38 వేల 254 మంది ఉన్నారు. అందులో 12 లక్షల 67వేల 471 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవికి 4లక్షల 65వేల 072 ఓట్లు వచ్చాయి.