
– ఒక్క రౌండ్లో 48 వేల ఓట్ల లెక్కింపు
– లెక్కింపు ఏడు రౌండ్లలో పూర్తయ్యే అవకాశం
– మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోతే
– రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
– రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై బుధవారం వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న అనిశెట్టి దుప్పలపల్లి గోదాము వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైందని, బ్యాలెట్ పేపర్స్ బండిల్స్ కట్టే ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తవగానే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ లో భాగంగా ఒక్కో హాల్లో 24 టేబుల్ లో చొప్పున నాలుగు హాల్లో ఈసారి 96 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్ కు 500 చొప్పున ఒక రౌండ్ లో 48 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంలోనే చెల్లిన ఓట్లను, చెల్లని ఓట్లను వేరు చేసి లెక్కిస్తారని చెప్పారు.మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని,మొదటి ప్రాధాన్యత ఓట్ల లో ఫలితం తేలనట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సైతం ఇదే పద్ధతిలో కొనసాగుతుందని తెలిపారు. ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ ఎం ఎల్ సి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, అన్ని ర్యాంకులకు చెందిన 800 మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తులో పనిచేస్తున్నారని తెలిపారు.ఒక్కో కౌంటింగ్ హాల్ వద్ద డీఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని,కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఇదే భద్రత కొనసాగుతుందని తెలిపారు.