
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి ఆంధ్రయ్య అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయ శంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని చౌట్ పల్లి బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బడి బాట ప్రాముఖ్యతను వివరించారు. బడి ఈడు పిల్లలను, బడి బయట పిల్లలను, బడి మధ్యలో మానేసిన పిల్లలను బడిలో చేర్పించడం, అసలు పాఠశాలకు వెళ్ళని పిల్లలు లేకుండా చూడడం మన భాద్యత అన్నారు. ప్రభుత్వం ఈనాడు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్నభోజనం, ఉదయం అల్పాహారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు మంచిగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అన్నారు.అనంతరం గ్రామంలో బడి ఈడు పిల్లల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలికల పాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్ఖాన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మి నర్సయ్య, గ్రామ సమైక్య అధ్యక్షురాలు కమల, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు కే.శ్రీనివాస్, బంతిలాల్, ఎ. శ్రీనివాస్, రాజు, ప్రవళిక, హేమలత, గీత, సంతోష్, సి అర్ పి లు పెద్ద అంజయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.