నవతెలంగాణ – చండూరు
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తేరేట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం నాయక్ అన్నారు. బుధవారం గట్టుపల్ మండలం లోని తేరేట్పల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో వినూత్నంగా ప్రచారం చేశారు. మైక్ సెట్ ద్వారా గ్రామంలో కలియ తిరుగుతూ మీ పిల్లల చదువులకు మేము గ్యారెంటీ అని పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగనీ ప్రచారం చేస్తూ బడిబాట కార్యక్రమంలో తాను రాసిన కవితను వినిపిస్తూ తానే ఒక యాంకర్ గా మారి తమ పాఠశాల పై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తులను అడిగారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శారీరక, మానసిక స్థితి బాగా ఉంటుందని,కష్టం విలువ ఏంటో తెలుసుకుంటారని తమ పిల్లలకు చదువు రాకపోతే నిగ్గదీసి అడగవచ్చని ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులకై గ్యారెంటీ ఇస్తున్నామని, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు చెప్పే మాయమాటలను నమ్మొద్దని బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, అందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ బడి బాట ప్రచార కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రేణుక ఉపాధ్యాయులు గోన వెంకటేశ్వరరావు, నరసింహ, రాణి, మల్లేశం,వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.