హరీశ్‌రావుపై రేవంత్‌ ఆరోపణలు నిరాధారం

– సీఎం సొంత గ్రామంలో బీజేపీకి ఆధిక్యత… బదిలీ చేశారా? : డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు తమ పార్టీ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని బీఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందంటూ …మరి ఆ ఓట్లు రేవంత్‌ రెడ్డి బదిలీ చేయించినట్టా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం గెలిచిన కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్నారనీ, అదే నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 22 వేలకు పడిపోయాయని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టే మెజారిటీ వస్తే మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచేవారని తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఓట్లను బదిలీ చేసి బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణను గెలిపించారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ రెడ్డి పేలుతున్న ప్రేలాపనలు ఆడలేక మద్దెల ఓటు అన్నట్టుగా ఉన్నాయని ఎర్రోళ్ల ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ను విమర్శించడం మానుకుని ఆరు నెలల పాలనలోనే 8 ఎంపీ సీట్లకే కాంగ్రెస్‌ పరిమితమయిందో సమీక్షించుకోవాలని సూచించారు.