పాఠశాలల్లో తుది దశ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

నవతెలంగాణ – సిరిసిల్ల
అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టి, తుది దశలో ఉన్న మరమ్మతు పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లాలోని ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి అదనపు కలెక్టర్ పి. గౌతమితో కలిసి కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్ని పాఠశాలల్లో పనులు పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగితా పనులు త్వరగా పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగుదొడ్ల లో మరమ్మతు పనులు చేయించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని వివరించారు. తుది దశకు చేరుకున్న పనులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఆర్డీఓ శేషాద్రి, డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.