అంచమడుగు ఆగం

– ప్రయివేట్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కబంధహస్తాల్లో చిక్కిన వైనం
– బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్న తీరు
– పట్టించుకోని స్థానిక రెవెన్యూ అధికారులు
– ఈసీ వాగుకు పొంచి ఉన్న ముప్పు
నవతెలంగాణ-శంషాబాద్‌
శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు చందనవెళ్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు కార ణంగా శంషాబాద్‌ షాబాద్‌ రహదారి ఇరువైపులా భూములకు రెక్కలు వచ్చాయి. బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 111 జీవో పరిధిలో శంషాబాద్‌ మం డలం ఉన్నప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెన కడుగు వేయడం లేదు. బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు ప్రకృతి వనరులను సహజ సిద్ధమైన కాలువలు, వాగులు చెరబడుతున్నారు. వీరు చేస్తున్న వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకుం డా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో శంషాబాద్‌ మండలంలో జల వనరుల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తున్నది.
శంషాబాద్‌ మండల పరిధిలోని మల్కారం గ్రామ రెవెన్యూ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యి. ఒక బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ మల్కా రం రెవెన్యూ లోని సుల్తాన్‌పల్లి అనుబంధ గ్రామమైన కేబీ దొడ్డి సమీపంలో పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నది. ఇందులో భాగంగానే అక్రమ ని ర్మాణాలు జోరందుకున్నాయి. ఈ భూమి అమ్డాపూర్‌- కేబిదొడ్డి గ్రామాల మధ్యన ఈ వెంచర్‌ నిర్మిస్తున్నారు. అంచ మడుగు ఈసీ వాగు నుంచి పాయగా చీలి మళ్లీ ఈసి వాగులో కలుస్తుంటుంది. అయితే ఈ ప్రధాన కాలువను అక్కడ వెంచర్‌ నిర్మిస్తున్న నిర్మాణదారులు పూర్తిస్థాయిలో ధ్వంసం చేసి కాంక్రీట్‌ కాలువగా మార్చేసుకున్నారు. ఈ విషయంలో రెవెన్యూ ఇరిగేషన్‌ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్ల పూర్తిగా కాంక్రీట్‌ జంగల్‌గా మారిపోయింది. ఇరిగేషన్‌ జిల్లా అధికారి ఇచ్చిన లెటర్‌ ఆధారం చేసుకుని సు మారు 34 ఎకరాల విస్తీర్ణంలో ఈ వెంచర్‌ ఏర్పాటు చే శారు. స్థానికులు అనేకసార్లు ఫిర్యాదు చేసిన ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు బడా నాయకులు వారికి అండగా ఉండడంతో అంచ మడుగు ఆక్రమణకు గురైంది. ఈ బడా వెంచర్‌ ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తున్నది. కాంక్రీట్‌ జంగిల్‌గా మారితే వర్షాకాలంలో వచ్చే వరద నీటిని ఈసీ వాగు కానీ హిమాయత్‌సాగర్‌ కానీ తట్టుకునే అవకాశం లేదు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు దీనిపై స్పష్టమైన వైఖరితో అంచ మడుగు ఆగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.