పరుగు పందెం

ఈ మధ్య వీక్‌ఆఫ్‌ రోజు ఊరెళ్లినప్పుడు కరీంనగర్‌ బస్టాండ్‌లో చిన్ననాటి మిత్రు డొకరు కలిశాడు. పిచ్చాపాటి తర్వాత ‘ఎక్కడికి రా’ అని అడిగితే హైదరాబాదని చెప్పాడు. వాడితో పాటు వాళ్లావిడ, వాళ్లబ్బాయి, వాళ్లత్తగారు కూడా ఉన్నారు. ఆరా తీస్తే… వాడి చిన్న కొడుకుది పదోతరగతి అయిపోయింది. 9.5 జీపీ వచ్చింది. వాన్ని ఇంటర్‌లో జాయిన్‌ చేసేందుకు పట్నం బాట పట్టారు. మనసు చంపుకోలేక అడిగా. ‘ఏరా కరీంనగర్‌లో మంచి కాలేజీలున్నాయంటారు కదా, మరి అంత దూరమెందుకురా’ అంటే నీళ్లు నమి లాడు… ‘గట్టిగా మాట్లాడకురా మా ఆవిడ వింటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడే మొదలవుద్ది’ అని పక్కకు తీసుకుపోయాడు. మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ డాక్టర్‌ కాలేదు. చిన్నోడినన్న డాక్టర్‌ చేయాలని మా ఆవిడ కోరిక. వద్దు ఖర్చులు భరించడం మనతో కాదన్నా… అయినా ఎవరూ వినలేదు. అందరూ వాడి పార్టే… చివరికి తప్పలేదు అని నిట్టూర్చాడు. గత వారం వచ్చి కాలేజీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాస్టల్‌ ఫీజుతో కలిపి ఏడాదికి రెండున్నర లక్షలు అవు తాయట అని చెప్పాడు. ‘అన్ని డబ్బులు పెట్టి చదివి పిస్తున్నావు. గవర్నమెంట్‌ సీట్‌ రాకుంటే ఎలా? ఇదేం ఇంజినీరింగ్‌ కాదుగదరా’ అని సందేహం వెలిబుచ్చా. ‘దానికి సిద్ధమయ్యాం… సర్కార్‌ కోటాలో సీట్‌ రాకుంటే కరీంనగర్‌లో ఓ ఇల్లుంది. అమ్మేసీ మేనేజ్‌మెంట్‌ కోటాలోనైనా సరే డాక్టర్‌ను చేయాలని డిసైడయ్యాం. తప్పదు గదరా.. మనం సంపాదించింది వాళ్లకోసం కాక మరెవరికి’ అని చిన్నగా నవ్వాడు. ఇంతలో వాడి బస్సు బయలుదేరేందుకు సిద్ధ్దమవడంతో వెళ్లి సీట్లో కూర్చున్నాడు. అత్యంత వేగంగా పరుగెడుతున్న నేటి ఆధునిక సమాజంలో…తమలా కాకుండా తమ వారసులను అత్యున్నత శిఖరాలకు అధిరోహింప జేయడానికి ఎన్ని కష్టాలయినా, ఎన్ని నష్టాలయినా భరించాల్సిందే అనే పట్టుదల వాడి ముఖంలో కనిపించింది. నాకనిపించిందప్పుడు… ప్రస్తుతం కార్పొరేట్‌ చదువుల పరుగుపందెం నడుస్తున్నది… ఆస్తులు అమ్మైనా సరే వాళ్లతో జతకట్టాల్సిందే… లేకుంటే వెనకబడిపోతామనే భయం పేద, మధ్య్యతరగతిని సైతం కార్పొరేట్‌ వైపు పరుగులు పెట్టిస్తోంది.
– ఊరగొండ మల్లేశం