– నేటి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
– జిల్లాలో 52 సెంటర్లు.. 18,403 మంది అభ్యర్థులు
– బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్
– 9 నుంచి 10 గంటల మధ్యే కేంద్రంలోకి అనుమతి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించే గ్రూప్- 1 పరీక్ష కోసం ఖమ్మం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ – 1 పరీక్ష నిర్వహించినా లీకేజీల కారణంగా రద్దు అయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రూప్-1 పరీక్షను సక్సెస్ ఫుల్ గా నిర్వహించి నిరుద్యోగుల మెప్పు పొందాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష కోసం జిల్లా కలెక్టర్ల నేతత్వంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్ కు అభ్యర్థులను ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కేంద్రంలోకి అనుమతిస్తారు. 10 గంటలు దాటిన తర్వాత ఎవరు వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఈసారి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు సైతం సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకుపోవడానికి వీలులేదు. అలాగే పచ్చబొట్లు, టాటూలు, షఉలు ధరించిన అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరు.
జిల్లాలో 18,403 మంది అభ్యర్థులు..
జిల్లాలో 18,403 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 52 సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. వీరితో పాటు 18 మంది ప్లయింగ్ స్క్వాడ్ బందాలను ఏర్పాటు చేశారు. ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు 184 మందిని సైతం నియమించారు. ఈ పరీక్షలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ, ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్ జాన్ బాబు, రాజ్ కుమార్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ కేంద్రాన్ని సందర్శించాలని టీఎస్ పీఎస్సీ అభ్యర్థులకు ఫోన్ మెసేజ్ లు పంపడంతో పాటు అధికారులకు సూచనలు చేస్తోంది.
అనేక సూచనలు…
ఉదయం 10.00 గంటలకు కేంద్రాల గేట్లు మూసి వేస్తారు. మహిళా అభ్యర్థులను తనిఖీలు చేయడానికి, ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష హాలులో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థికి అభ్యర్థికి ఒక మీటరు దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించుకొని, సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకువెళ్లాలి. ఫ్లైయింగ్ స్కాడ్స్ , డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సెల్ ఫోన్ లు అనుమతి లేదు. అభ్యర్థులు షఉస్, జ్యూవెల్లరి వేసుకొని రాకూడదు. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లకు, రికార్డింగ్ వస్తువులు, కాలిక్యులేటర్స్, వాచ్, రైటింగ్ ప్యాడ్ లకు అనుమతి లేదు. పరీక్ష ప్రారంభానికి కొంత సమయానికి ముందు నోడల్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూం నుంచి ప్రశ్నాపత్రాలని కేంద్రాలకు తరలిస్తారు. ఇలా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.