వివాదాస్పదంగా దాస్‌ నియామకం

– ఏపీ అధికారిని నియమిస్తారా ? అంటూ బీఆర్‌ఎస్‌ నేతల గరంగరం
– గులాబీ కాలంలోనే ఏం చేశారు ?
– ఎదురుతిరుగుతున్న కాంగ్రెస్‌
నవతెలంగాణ ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర సాగునీటి పారుదల, అభివృద్ధి శాఖ సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌ నియామకం వివాదాస్పదమవుతున్నది. ఏపీ ప్రయోజనాల కోసం పని చేసిన అధికారిని తెలంగాణలో ఎలా నియమిస్తారంటూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కేఆర్‌ఎంబీలో తెలంగాణ అవసరాలను తొక్కిపెట్టేలా చూశారనీ, ఆయన్ను తెలంగాణ సలహాదారుగా నియమించడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. దాస్‌ గతంలో ఏపీ మాజీ సీఎస్‌గానే గాక ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. అలాగే 2021కి ముందు ఏపీ సాగునీటి శాఖకు ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఢిల్లీలో ఏపీ సర్కారు సలహాదారుగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని రాష్ట్రంలోని కీలకమైన శాఖకు సలహాదారుగా నియమించడం సరికాదనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆదిత్యనాధ్‌ దాస్‌ను లోక్‌సభ ఎన్నికల ముందే నియమించాలని రేవంత్‌ సర్కారు భావించింది. ఆయనతో సంప్రదింపులు సైతం చేపట్టింది. ఆలోపు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ రావడం, వెనువెంటనే కోడ్‌ అమల్లోకి వచ్చేయడంతో నియామకం సాధ్యం కాలేదని తెలిసింది. దీంతో కోడ్‌ ఎత్తేసిన ఒక రోజులోనే దాస్‌ను సలహాదారుగా నియమించడం గమనార్హం. ఏపీ అధికారిని నియమించారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నా, కాంగ్రెస్‌ నేతలు నియామకాన్ని సమర్థిస్తున్నారు. అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తే, ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకున్న అనుభవం దృష్టా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల్లో నీటి ప్రయోజనాల కోసం ఆదిత్యనాధ్‌ దాస్‌ సేవలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే, తెలంగాణపై కర్రపెత్తనం ప్రారంభించారని సింగిరెడ్డి అనడాన్ని తప్పుబడుతున్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శలు పనిగట్టుకుని చేయడం సరికాదనీ, కర్రపెత్తనం చేస్తే సహించే పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదని వ్యాఖ్యానిస్తున్నారు. పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యనాధ్‌ దాస్‌ కీలకపాత్ర పోషించారని సింగిరెడ్డి చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారు. గత పదేండ్లుగా అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన మంత్రివర్గ సహచరులే కదా, తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంటే ఏంచేశారని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ హయాంలోనే కృష్ణాజలాలను తీవ్రంగా నష్టపోయామనీ, కాళేశ్వరం ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా కట్టి వేల కోట్లు నష్టపోయేలా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పుకు కాంగ్రెస్‌ సర్కారు వడ్డీ కడుతున్న సంగతిని గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశారనీ, ఇప్పుడు నిర్మాణాలకు గ్యారెంటీ లేదని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన సంగతిని కాంగ్రెస్‌ నేతలు సింగిరెడ్డికి గుర్తు చేస్తున్నారు.