
– ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరి మైనారిటీలకు కళాశాలలు ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ – పాల్వంచ
రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల కొరకు గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 204 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు 8000 మంది విద్యార్ధులకు పైగా ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటికి వెళ్తున్నారని, మైనారిటీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున అనేక మంది విద్యార్ధులు గత 4 ఏండ్లుగా ఇంటర్ తర్వాత చదువులకు స్వస్తి పలుకుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, బీసీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి మైనారిటీ డిగ్రీ కళాశాలలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉమ్మడి జిల్లాకు ఒక్కటైన మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్చి నెలలో లేఖ రాయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసినట్లైతే డ్రాప్ అవుట్స్ లను తగ్గించి, మైనారిటీ విద్యార్దులకు బంగారు భవిష్యత్ ను అందించిన వారవుతారన్నారు.