బైపాస్ రోడ్డు ఎంపికలో మార్పు చేయాలి..

– మూడు నుండి ఒకటవ ఎంపికకు మార్చాలి
– కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన నల్లగొండ పట్టణ ప్రజలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణ బైపాస్ మార్గం ఎంపిక లో మార్పు చేయాలని కోరుతూ నల్లగొండ పట్టణం గొల్లగూడ, శ్రీనివాస కాలనీ బిటిఎస్ కు చెందిన పలువురు  బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ .. ఎన్ హెచ్ 565  బైపాస్ మార్గం ఎంపికను  3 నుండి  1 కు మార్పు చేయాలని కోరారు. బైపాస్ మార్గం ఎంపిక 3 ద్వారా పట్టణంలోని  2730 కుటుంబాల పై  తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన చెందారు. చిన్నపిల్లల నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు ఎంపిక 3 అనేది సరైనది కాదుగా భావిస్తున్నారని అన్నారు. ఈ సమాచారం బయటకు రాకుండా చేయడం, ఆన్లైన్లో గెజిట్ నోటిఫికేషన్ లేకపోవడం విచారకరమన్నారు. ఎంపిక 3 నుండి  ఎంపిక 1 కు మార్పు చేయడం వలన తక్కువ దూరంతో మంచి రహదారి మార్గం ఏర్పడుతుందని, తక్కువ ఖర్చుతో ప్రభుత్వ నిధుల ఆదా జరుగుతుందని, ప్రజలపై తక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. కావున బైపాస్ రోడ్డు ఎంపికలో మార్పు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జి.  సైదులు బి. శ్రీనివాస్ డి. అమర్ కే. వెంకటరెడ్డి డి. రాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.