అర్థన్‌ ఫైనాన్స్‌కు రూ.50 కోట్ల నిధులు

అర్థన్‌ ఫైనాన్స్‌కు రూ.50 కోట్ల నిధులుముంబయి : స్వయం ఉపాధి పొందిన నానో, మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌ల కోసం అవసరమైన రుణాలను అందించే రుణ సంస్థ అర్థన్‌ ఫైనాన్స్‌ రూ.50 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపింది. ఈ బ్యాంకింగేతర విత్త సంస్థ తమ సిరీస్‌ బి ఫండింగ్‌ రౌండ్‌లో భాగంగా ఇన్‌కోఫిన్‌ ఇండియా ప్రోగ్రెస్‌ ఫండ్‌, మైఖేల్‌ అండ్‌ సుసాన్‌ డెల్‌ ఫౌండేషన్‌ సంస్థల నుంచి ఈ నిధులు పొందినట్లు వెల్లడించింది. ఈ ఫండ్‌ను కంపెనీ విస్తరణ, సాంకేతిక పురోగతికి ఉపయోగించనున్నట్లు అర్థన్‌ ఫైనాన్స్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ కునాల్‌ మెహతా తెలిపారు. ఇప్పటి వరకు, అర్థన్‌ ఫైనాన్స్‌ సుమారు రూ.83 కోట్ల సమీకరించిందన్నారు. తమ సంస్థ రూ.2,000 నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాలతో 20,000 కంటే ఎక్కువ మంది రుణగ్రహీతలకు రూ. 500 కోట్లకు పైగా పంపిణీ చేసిందని అర్థన్‌ ఫైనాన్స్‌ సీఈఓ ప్రవాష్‌ దాష్‌ తెలిపారు.