– భద్రతా మండలి తీర్మానం ఆమోదం
న్యూయార్క్ : గాజాపై గత 8మాసాలుగా ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులకు అంతం పలికే లక్ష్యంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను ధ్రువీకరిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 14-0 ఓట్ల తేడాతో సోమవారం ఈ తీర్మానం ఆమోదించబడింది. గత నెల్లో ప్రకటించిన మూడంచెల కాల్పుల విరమణ ప్రతిపాదనను తీర్మానం స్వాగతించింది. తొలి దశలో భాగంగా తొలుత ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలని, గాజాలో కొంతమంది బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్ళలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని ఆ తీర్మానం కోరుతోంది. ఇక రెండో దశలో శాశ్వత కాల్పుల విరమణ, మిగిలిన బందీల విడుదల అమలు జరగాలి. పూర్తిగా విధ్వంసమైన గాజా పునర్నిర్మాణ ప్రయత్నాలు మూడో దశలో చేపట్టాలి. ఇజ్రాయిల్ ఈ ప్రతిపాదనను ఆమోదించిందని అమెరికా చెబుతోంది. హమస్ ఆమోదించాలని తీర్మానం కోరుతోంది. ఈ ప్రతిపాదనను తాము సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తొలుత వ్యాఖ్యానించింది. ఎలాంటి షరతులు లేకుండా ఈ తీర్మానాన్ని ఇరు పక్షాలు పూర్తిగా అమలు చేయాలని కోరింది. తీర్మానంపై ఓటింగ్ అనంతరం హమాస్ ఒక ప్రకటన చేస్తూ, మధ్యవర్తులతో సహకరించడానికి సిద్ధంగా వున్నామని చెప్పింది. ఒప్పందం అమలుపై పరోక్షంగా చర్చలకు కూడా సిద్ధంగా వున్నామని తెలిపింది. ఎట్టకేలకు ఇది అమల్లోకి వస్తుందా లేదా అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలిందని మీడియా వర్గాలు వ్యాఖ్యానించాయి. ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది అంతిమంగా శాశ్వత కాల్పుల విరమణకు దారి తీయాలని, గాజా నుండి పూర్తిగా ఇజ్రాయిల్ బలగాలు వైదొలగాలని, గాజా పునర్నిర్మాణం జరగాలని హమాస్ కోరుతోంది.J