బీఆర్‌ఎస్‌లో చేరిన ఆనంద్‌రారు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్‌ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చిన ఆర్టీఐ, సామాజిక కార్యకర్త ఆనంద్‌రారు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరారు. బుధవారం నాడాయన ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ‘జై ఆదివాసి యువశక్తి సంఘటన్‌’ అనే గిరిజన హక్కుల వేదిక బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలిపింది. ఈ సంఘం మధ్యప్రదేశ్‌లో ఆదివాసి, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుంది. దీనిలో ఆనంద్‌ రారు కీలక నేతగా పనిచేస్తున్నారు. ఆ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు లాల్‌ సింగ్‌ బర్మన్‌, పంచం భీల్‌, అశ్విన్‌ దూబె, గాజీరామ్‌ బడోలే, కైలాశ్‌ రాణా తదితరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.