‘నా’ నుంచి ‘మ’ వరకు రానేలేదు..’మన’ అనుకున్నప్పుడు కదా ముందడుగు” అని కాళోజీ అప్పటి రాజకీయాలను ఉద్దేశించి ఏనాడో మొట్టికాయ వేశారు. దేశంలో గత ప్రభుత్వాన్ని నడిపింది కూడా నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమూహమే. కానీ భవిష్యత్తుకు ఎన్డీఏ గ్యారెంటీ అని కాకుండా ఒక వ్యక్తి, ‘మోడీకా గ్యారెంటీ’ అనే మితిమీరిన ఆత్మవిశ్వాసపు ప్రొజెక్షన్‌కు ఈ ఎన్నికల్లో తగిన శాస్తి జరిగింది. అందుకే కాబోలు ఇప్పుడు మా, మా… అనే శబ్దాలు ఇరవైయేండ్ల అనుబంధాలను గుర్తు చేసుకుని మరీ వినిపిస్తున్నాయి. ఇక ”మన…” అంటూ ప్రయాణం చేయకపోతే ప్రజలే మట్టి కప్పేస్తారని దశాబ్దకాలం తర్వాత గానీ అర్థం కాలేదు వారికి. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం లేదని ఎన్నికల ఫలితాలు బయటపడుతున్న సమయం వరకు గతంలో దేశాన్ని నడిపింది ఎన్డీఏ అనబడే కూటమి అనే అంశం దాదాపు ఎవ్వరి మదిలోనూ లేదంటే ఆశ్చర్యం కాదు. అందుచేత ‘నువ్వెవరో నీకే గుర్తుచేసిన తీర్పు’ను ఈ సాధారణ ఎన్నికలు ఇచ్చాయి. సరైన రీతిలో గుణపాఠాన్ని చెప్పాయి.
ముగిసిన ఈ సాధారణ ఎన్నికలు ఒక భూకంపాన్ని తలపించే ప్రభావాన్ని చూపాయి. ఇప్పుడైనా సరైన నిర్దారణలు చేసుకోవాలి. అహంకారాగ్నిపై విరుచుకుపడిన తుఫానులాంటిదీ ప్రజల తీర్పు. కడలి గర్భంలోంచి సైతం ఎగిసిపడే శక్తి ఉన్న మత విద్వేషాగ్నిని ఎగదోయకుంటే ఎగిసిన నిప్పురవ్వలన్నీ నీలిగే రాళ్లలో నిక్షిప్తమై పోయిన మాదిరి మహామహులంతా మట్టి కరిచి ఉండేవాళ్లు. ‘చావుతప్పి కన్ను లొట్టబోయింది’ అని కొందరు సర్దుకుంటూ ఉండవచ్చు. కానీ ఇది చావుదెబ్బ అని గుర్తుపెట్టు కోవాలి. మతపరమైన ఏకీకరణ ద్వారా అధికారానికి నిచ్చెన వేసే ఆలోచనలకు మరణశాసనం ఈ తీర్పు. సెంగోల్ పట్టుకుని రాజదర్పంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన వారినే రాజ్యాంగం ముందు మోకరిల్లేలా చేశాయి ఈ ఎన్నికల ఫలితాలు. తనకు తాను దైవాంశ సంభూతుడనని ప్రకటించు కుంటుంటే చూస్తూ ఊరుకుంటుందా సమాజం?
కొందరిని మినహాయిస్తే, సాధారణంగా ఏ ఓటరు తన ఓటుని ఈసారి ఫలానా కారణాల చేత ఫలానా వారికే వేయాలి అని ఒక నిర్ధారణకి రాడు. పరిపాలింపబడుతున్న కాలంలో గురైన భావన పోలింగ్ బూతులో ప్రత్యక్షమై అప్రయత్నంగానే కొందరికి బుద్ధి చెప్పే ఒక బటన్ నొక్కుతాడు. ఒకరి ప్రస్థానం ఎదుటివారికి ఎలాంటి అనుభూతిని ఇచ్చిందన్నదే చివరాఖరికి ప్రధానం అన్న నానుడి ఈ సందర్భంగా గమనార్హం. పరిపాలన కన్నా పరిపాలిస్తున్న తీరు చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఏనాడో ఆ ధ్యాస వదిలేసి కనీసం సహచర మంత్రులను కూడా గుర్తించకుండా ఏకచత్రాధిపత్య పాలన సాగిన తీరును అందరూ గమనించారు. ముస్లింలను చొరబాటుదారులుగా, అధిక సంతానం కలిగిన వారుగా చిత్రీకరిస్తూ ఎన్నికల లబ్దికై చేసిన ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష పార్టీలను ముస్లింల పక్షపాతులుగా, బుజ్జగింపు రాజకీయాలు చేసేవిగా ముద్రేయజూసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాహుల్ గాంధీని ఎద్దేవా చేసే ప్రయత్నాలేవి చెల్లకపోగా ఆయన చేసిన భారత్ జోడోయాత్ర, భారత్ జోడో న్యారు యాత్ర ప్రజలను ఎంతోకొంత ఆకర్శించాయి. ‘రాజ్యాంగాన్ని మార్చేయం, రిజర్వేషన్లను రద్దు చేయం’ అంటూ ఎన్నికలకు ముందే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కర్నాటకకు చెందిన అనంత్ కుమార్ హెగ్డె, తెలంగాణకు చెందిన ధర్మపురి అరవింద్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు, ఉత్తర భారతదేశంలోని అనేక మంది రాజ్యాంగంలోని సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు తొలగిస్తామనడాన్ని ప్రజలు మరచిపోలేదు.
ఎన్నికల ఫలితాలపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది పోయి, నాటి ఆయన రాజ్య ప్రజలే శివాజీ మహారాజును ఓడించారనీ, నేటి మోడీ అధికార కూటమికి మెజారిటీ తగ్గగానే ప్రజలను దోషులుగా చేస్తూ వాట్సాప్ యూనివర్సిటీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే మరో ప్రయత్నం చేస్తున్నది. మెజార్టీ తగ్గినందుకే ఇలా ప్రవర్తిస్తుంటే ఒకవేళ ఓడిపోతే ప్రజలను మూకుమ్మడిగా హింసించే వాళ్లేమో! ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును గౌరవించే వాళ్లు చేయాల్సిన పనికాదిది.అధికారాన్ని హస్తగతం చేసుకున్న వాళ్లే ఇలా నిందారోపణలు చేస్తుంటే, అధికారానికి ఆమడ దూరంలో నిలబడి ఓటమిపాలైన వారు ఎవరిని నిందించాలి? ఇలాంటి సమయంలో హుందాతనం ఎంతో అవసరమని గుర్తించాలి. గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని ఏ కూటమి ప్రభుత్వాన్నైనా, ఎప్పుడైనా కూలదోసి, మరో కొత్త కూటమిని నిర్మించి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటే ప్రజలు గమనిస్తలేరనుకోవడం కేవలం వారి భ్రమ.
జి.తిరుపతయ్య
9951300016