ప్రణయ్ శుభారంభం

ప్రణయ్ శుభారంభం– సమీర్‌, కిరణ్‌, సిక్కి జోడీ ముందంజ
– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500
సిడ్నీ (ఆస్ట్రేలియా): భారత సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణయ్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. బ్రెజిల్‌ ఆటగాడిపై 21-10, 23-21తో ప్రణరు పైచేయి సాధించాడు. ఐదో సీడ్‌ ప్రణరు నేడు ప్రీ క్వార్టర్స్‌లో మిశా (ఇజ్రాయెల్‌)తో తలపడనున్నాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో సమీర్‌ వర్మ 21-10, 21-10తో, కిరణ్‌ జార్జ్‌ 21-17, 21-12తో తొలి రౌండ్లో విజయాలు సాధించారు. రఘు మారిసామి, శంకర్‌ ముతుసామి, మిథున్‌ మంజునాథ్‌, రవి, అభిషేక్‌లు తొలి రౌండ్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్‌ సహచర షట్లర్‌ కెయూర మోపాటిపై 21-10, 21-8తో సాధికార విజయం సాధించింది. ఆకర్షి కశ్యప్‌ 21-14, 21-11తో ఉక్రెయిన్‌ అమ్మాయిపై గెలుపొందింది. ఇమద్‌ ఫరూకీ 23-21, 13-21, 22-24తో చైనీస్‌ తైపీ షట్లర్‌తో పోరాడి ఓడింది. అనుపమ 21-14, 23-21తో వాంగ్‌ లింగ్‌ చింగ్‌పై వరుస గేముల్లో గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది.
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు తేజాలు సిక్కిరెడ్డి, సుమిత్‌ రెడ్డి జోడీ 21-17, 21-19తో వరుస గేముల్లో మలేషియా షట్లర్లు వాంగ్‌, లిమ్‌లపై విజయం సాధించారు. కోన తరుణ్‌, కృష్ణప్రియ జోడీ 6-21, 11-21తో తొలి రౌండ్లో పరాజయం పాలయ్యారు. ఆయుశ్‌, శృతి జంట సైతం 16-21, 10-21తో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ, శ్వేతపర్ణ జంటకు తొలి రౌండ్లో బై లభించింది. హర్షిత, శృతిలు 19-21, 19-21తో పోరాడి ఓడారు.