జోరుగా ‘బడిబాట’

తెలంగాణ రాష్ట్రంలో ఏమన ఊరు-మన బడి’కి ఆదరణ పెరిగింది. ఆంగ్లమాధ్యమ బోధనపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి కనబుస్తున్నారు. సర్కారు బడుల రూపురేఖలు మారనున్నాయి. ఈ సారి భారీగా ఎన్‌రోల్‌మెంట్‌ పెరగనుంది. సర్కారు బడుల్లో పిల్లల నమోదు సంఖ్య పెంచడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ముఖ్యంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మరో వైపు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండటంతో పాఠశాలల్లో కొత్తగా విద్యార్థుల ప్రవేశాలు పెంచడంపై విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ నెల 3 నుంచి ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ పేరిట బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ నెల 9వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత 12 నుంచి 17 వరకు రోజు వారీగా పాఠశాల స్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రతీ రోజు బడిబాటలో నూతన ప్రవేశాలు భారీగా జరుగుతూవున్నాయి. అనేక జిల్లాలలో చాలామంది పిల్లలు సర్కారు బడుల్లో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఇందులో ప్రయివేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరే వారి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఎండను లెక్క చేయకుండా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బృందాలు, విడిగా ప్రతీ విద్యార్థి, వారి తల్లి దండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రచారం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి కూడా పిల్లలు భారీగానే చేరుతున్నారు. బడి బాట కార్యక్రమం అమలులో భాగంగా తొలి రోజు పాఠశాల పరిధిలోని ఆవాస ప్రాంతాల్లో పిల్లల వివరాలను ఆయా పాఠశాలల టీచర్లు ఇంటింటికి తిరిగి నమోదు చేశారు. ప్రధానంగా బడిబాట ప్రాధాన్యంపై ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, తల్లిదండ్రులతో సమావేశం, మన ఊరు-మన బడి పథకం ద్వారా సమకూరే మౌలిక సదుపాయాలు, ఆంగ్ల మాద్యమం గురించి వివరిస్తున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా బడిబాట కార్యాచరణ అమలు చేస్తున్నారు. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసు కుంటుంది. ఏటా బడిబాట కార్యక్రమాన్ని జూన్‌లో నిర్వహిస్తుంటారు. గత విద్యాసంవత్సరం నుంచి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమల చేస్తుండటంతో పాఠశాలలకు మహర్థశ పట్టింది. అన్ని జిల్లాలలో తొలి విడతగా గుర్తించ బడిన సర్కారు పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు కూడా పూర్తి అయినాయి. ప్రయివేటుకు దీటుగా మౌలిక వసతులు పెరగనున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగింది. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాల్లో కూడా ఓవైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు. పిల్లల విద్యాభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి వారిని చేర్పించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని జిల్లాల్లో బడిబాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. బడిబాటలో భాగంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడీడు పిల్లలను బడిలో చేర్చు కుంటున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి విడత నిధులు విడుదల అయ్యాయని, వాటితో నీటివసతి, విద్యుద్ధీకరణ, శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ప్రతీ రోజు ఆయా పాటశాలలో విధులు నిర్వహిస్తూవున్న ఉపాధ్యాయులు ఉదయం 7 నుండి 11 గంటల వరకు గ్రామాలలో తిరుగుతూ ఎండ వేడమిని సైతం లెక్క చేయకుండా బడి బాట కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు తల్లిదండ్రులకి చెపుతూ ఉన్నారు. ఇంటి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. జిల్లా అధికారులు కూడా ఎప్పటి కప్పుడు బడిబాట కార్యక్రమం మీద సమీక్షా సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు ఇస్తూవున్నారు. జూమ్‌ సమావేశాలు నిర్వహించి బడిబాట కార్యక్రమం విజయవంతంలో ప్రజా ప్రతినిధులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు, యువత, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ టీచర్లు భాగస్వామ్యవుతున్నారు. సర్కారు బడి… కొలువులకు నిధి. ప్రభుత్వ బడుల రక్షణ మనందరి విధి
కమిడి సతీష్‌రెడ్డి
9848445134
.