– భారీ వర్షానికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించినప్పటికీ భద్రాచలంలో మాత్రం గత పది రోజుల నుండి వుక్క పూతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. సుమారు రెండు గంటలకు పైగా కురిసిన భారీ వర్షంతో భద్రాచలం తడిసి ముద్దయింది. పట్టణ వ్యాప్తంగా అనేక చోట్ల చెట్లు కరెంటు తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం నెలకొంది. ప్రధానంగా పట్టణంలోని అశోక్ నగర్, కొత్త కాలనీ, జగదీష్ కాలనీ రాజుపేట గ్రామాలే పరిసర ప్రాంతాలలో భారీ వర్షానికి చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాలో అంతరాయం నెలకొంది. వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెట్ల కొమ్మను తొలగించినప్పటికీ పట్టణంలో అనేక ప్రాంతాలలో రాత్రి సమయం వరకు విద్యుత్ పునర్ధన జరగలేదు. ఇది ఇలా ఉండగా పట్టణంలోని వైయస్సార్ నగర్‌లో సైడ్ డ్రైనేజీ లేక తొలకరి వానకే వీధులు చెరువులను తలపిస్తుండగా సాక్షాత్తు ఐఏఎస్ అధికారి కార్యాలయమైన ఐటీడీఏ ముందే ఈ విధమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదనకు గురై వెంటనే డ్రయినేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు.