సిద్ధిపేట నుండి బాల సాహిత్యంతో పాటు పుస్తక సమీక్షలు, వ్యాసాలు రాస్తూ ఇటీవల పత్రికల్లో కనిపిస్తున్న రచయిత, బాల సాహితీవేత్త యాడవరం చంద్రకాంత్ గౌడ్. 14 జూన్, 1980 న సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం. పెద్ద గుండవెల్లి గ్రామంలో చంద్రకాంత్ జన్మించారు. శ్రీమతి యాడవరం సుగుణ – శ్రీ యాదయ్య వీరి అమ్మానాన్నలు. వృత్తిరీత్యా రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పద్యకవిగా, పుస్తక సమీక్షకులుగా, బాల సాహితీవేత్తగా, బాల వికాసకారునిగా రాణిస్తున్న చంద్రకాంత్ నూరుకు పైగా వివిధ అంశాలపై వ్యాసాలు, వివిధ పుసకాలపై సమీక్షా వ్యాసాలు రాశారు.
కవి సమ్మేళనాలు, అవధానాలల్లో పాల్గొనడం, పద్య రచన ఆసక్తులుగా ఉన్న చంద్రకాంత్ బాల వికాసకారునిగా తనవంతు బాధ్యతగా బడి పిల్లలతో రచనలు చేయిస్తున్నారు. త్వరలో రాయిలాపూర్ బడి పిల్లల కథలు’ పేరుతో పిల్లలు రాసిన కథలను సంకలనంగా తేనున్నారు. ఉపాధ్యాయునిగా, రచయిగా, కవిగా వివిధ సత్కారాలు, పురస్కారాలు అందుకున్న చంద్రకాంత్ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం, కవిగా వేముగంటి నరసింహాచార్య ఉగాది పురస్కారం అందుకున్నారు.
వృత్తిరీత్యా నిత్యం పిల్లతో గడిపే అకవాశం కలిగిన చంద్రకాంత్ తన రచనల్లో ఎక్కువగా పిల్లల గురించి, వాళ్ళ మనస్తత్వం, ఇష్టాయిష్టాలు, ఆటల పాటల గురించి రాశారు. రచయితగా, బాల సాహిత్యకారునిగా అచ్చయిన చంద్రకాంత్ రచన ‘చండ్రుడె చెప్పిన కథలు’ బాలల కథల సంపుటి. నూటా యాభైకి పైగా పిల్లల కథలు రాసిన చంద్రకాంత్ ఎంపికచేసుకున్న కథలతో ఈ సంపుటి తెచ్చాడు. ఈ కథల గురించి చెబుతూ డా.హారిక చెరుకుపల్లి ”బడిలో పుస్తకాల సంచి మోసే పిల్లల పరిస్థితి తెలిసున్న మాష్టారు కనుక తన కథలన్నీ క్లుప్తంగా, సరళంగా మలిచి పిల్లలకు చదవడానికి సులువుగా ఉండేలా రాశారు” అంటుంది.
అవును ఈ సిద్ధిపేట కథల చంద్రుడు చెప్పిన బాలల కథల్లో రెండు మూడు కథలు తప్ప దాదాపు అన్ని కథలు ఒక పేజీకి మించి ఉండవు. వీటిని పిల్లలూ పెద్దలు చక్కగా చకచకా చదివేస్తారు కూడా. ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో ఎలాగైతే పిల్లలకు పాఠాలు, నీతులు చెబుతాడో తన ప్రతి కథలోనూ నీతి ఉండేలా రాశారు రచయిత. కథల్లో బడిని, బడి పిల్లలను, గ్రామీణ నేపథ్యాన్ని వివరంగా చెప్పే చంద్రకాంత్ తనకు తోచిన, కనిపించిన ప్రతి విషయాన్ని, అంశాన్ని కథలుగా మలిచాడు. అటువంటిదే ఇందులోని తొలి కథ ‘చెట్ల ప్రేమికుడు’. విద్యార్థులకు ఆసక్తివున్న అంశంలో ప్రోత్సహించినట్లయితే వాళ్ళ ప్రతిభ రాణిస్తుందన్న అంశానికి ఈ కథ చక్కని ఉదాహరణ. ధనుష్‌కు చెట్లు పెంచడం చాలా ఇష్టం. పాఠశాలను నందనవనంలా మార్చుతాడా విద్యార్థి. ఇదీ ఇందులోని కథ. చంద్రకాంత్ ప్రతి కథలో కనిపించే హీరోలు, పాత్రలు, అందరూ బడి పిల్లలే. ‘ఊరి రుణం’ కథ ఆదర్శ విద్యార్థి కథ. గ్రామం నుండి ఎదిగి, అమెరికాలో చదువుకుని, తాను చదివిన బడిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. ఇందులోని అనేక కథలు ప్రభుత్వ బడిలో చదివే పిల్లల జీవితంలో, వారి అభివద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ముఖ్యమైందో తెలియజేసేవిగా ఉంటాయి. ‘బడి పంతులు, మంచి మాష్టారు, ఆచార్య దేవోభవ, బడిని బతికిద్దాం, గురుదక్షిణ’ వంటి గురువు నేపథ్యంగా వున్న కథలు అటువంటివే.
‘స్నేహమంటే ఇదేరా…’ కథ ఇరవై అయిదేళ్ళ తరువాత కలుసుకున్న మిత్రుల మానవత్వం గురించిన కథ. ఆపదలో ఉన్న తమ మరో మిత్రున్ని ఆదుకునే కథ ఇది. తన గ్రామంలో, చుట్టు పక్కల బడుల్లో చూసిన దానిని బహుశా రచయిత కథగా మలిచి ఉండవచ్చు. కోవిడ్ నేపథ్యంతో గ్లోబంతా ఆన్‌లైన్ తరగతుల్లో కొట్టుమిట్టాడింది. అయితే ప్రత్యక్షంగా బడిలో పాఠాలు చెప్పడం గురించి రాసిన కథ ‘సారూ..! బడికొస్త’ బాలల కథ. బాల కార్మికులొద్దు, బడిలో బాలలు ఉండడమే ముద్దు అన్న అంశం ‘బడిబాట’ కథ విషయం. ‘మంచితనం’ కథ సాటి మనుషుల పట్ల సేవాభావాన్ని గురించి చెబితే, మరో కథ ‘మానవత్వం’ మానవ సంబంధాల విలువను తెలుపుతుంది. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో తెలిపే విధంగా రాసిన చక్కని కథ ‘ఆడపిల్ల’. ఇంతకుముందే చెప్పినట్టు ఇందులో పర్యావరణం పట్ల మనకున్న బాధ్యతను తెలిపే కథ ‘చెట్ల ప్రేమికుడు’. ఇదే కోవలో చంద్రకాంత్ రాసిన ‘నీరు-మీరు’, ‘సేంద్రియ వ్యవసాయం’, ‘ఇంకుడుగుంత’ వంటి కథలు చదవడానికి చిన్నగా ఉన్నా ఆచరణలో మిన్నగా ఉండాలనే సందేశాన్నిస్తాయి. నేటి బాలలు సెల్‌ఫోన్ వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలిపే కథ ‘సెల్‌ఫోన్ తెచ్చిన తంటా’. రచయితగా, కవిగా, సమీక్షకుడుగా, వ్యాసకర్తగా తనదైన విధంగా రచనలు చేస్తున్న బాల సాహితీవేత్త, బాల వికాసకారుడు యాడవరం చంద్రకాంత్ గౌడ్. జూన్ 14 చంద్రకాంత్ పుట్టిన రోజు. చంద్రకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
– డా|| పత్తిపాక మోహన్, 9966229548