పేగు బంధం కన్నా భక్తి భావం మిన్న

నవతెలంగాణ – జమ్మికుంట
ముస్లీంలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఈదుల్ జుహాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇస్లామీయా చర్రిత ప్రకారం జిల్ హజ్ మాసంలోని పదవ రోజున జరిగే చాలా ప్రాముఖ్యం గల పండుగ ఈదుల్ జుహా దీన్నే బక్రీద్ పండుగ అని అంటారు. ముస్లింల మూల స్థంబాలలో మొదటిది కల్మా (విశ్వాసం),నమాజ్, రోజా (ఉవాస దీక్షలు), జకాత్, ఐదవది హాజ్ ఉన్నాయి. హజ్ అనగా పవిత్ర యాత్ర అని అర్ధం۔ హజ్ అనే ఆరాధనలో ప్రజలు తన జీవిత కాలంలో కాబా గృహాన్ని ఒక్కసారైనా దర్శించుకునే సంకల్పంతో ఉంటారు. ఇది తన జీవిత కాలంలో తప్పని సరిగా ఒక్కసారిగా దర్శించుకోవాలి. మానవాళికి మార్గదర్శకం వహించడానికి దైవం తరుపున ప్రభవించిన ప్రవక్తల్లో హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ఒకరు గ్రంథజనులకు ఆయన మూల పురుషుడు…. నేడు ఇరాక్ గా పిలువబడుతున్న దేశంలో ఐదు వేల సంవత్సరాలకు పూర్వం హజ్రత్ ఇబ్రహీం ప్రవక్త జన్మించారు. ఆయన అన్ని వేళలా దైవం వైపునకు మరలేవారు. ఏకేశ్వర వాదం నచ్చని ఆయన జాతి ప్రజలు ఆయన వైపు కక్ష కట్టారు. ప్రారంభంలో ఆయనను భగభగ మండే అగ్నిలో పడదోశారు. చివరకు ఆ దేశం నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన ధర్మ ప్రచారం చేసుకుంటూ దేశాటన చేసేవారు. వయస్సు మీద మీద పడుతున్న కొద్ది సంతానం లేని బెంగ ఆయన్ను వేదించింది.
నిజ ధర్మాన్ని విశ్వ వాప్తం చేసేందుకు తనకు సంతానాన్ని ఒసంగమని ఆయన అల్లాహ్ కు ప్రార్థించేవారు. 86 సంవత్సరాల పండు ముదుసలి వయస్సులో హజ్రత్ ఇబ్రహీంకు దైవం వారసున్ని ప్రసాదించాడు. పుత్రుడిని పొంది అనందడోలికల్లో తేలియాడుతున్న ఇబ్రహీం త్యాగశీలతను విశ్వప్రభువు పరీక్షించదలిచాడు. దైవ ప్రసన్నత కోసం తనయున్ని ఎడారిలో వదిలి వెయ్యమని దైవాజ్ఞ అవుతుంది. దైవ ప్రసన్నతే ముఖ్యంగా భావించిన హజ్రత్ ఇబ్రహీం తన భార్య బీబీ హాజరా, కొడుకు హజ్రత్ ఇస్మాయిల్ ను ఎడారి ప్రాంతంలో వదిలి వేస్తారు. వారికి సమకూర్చిన అన్నపానీయాలు అయిపోగా తల్లి, బిడ్డ ఆకలితో అలమటించసాగారు. ఆ నిర్జన ప్రదేశంలో తనునెవరైనా ఆదుకుంటారేమోనని ఆదుర్దాతో బిబీ హజరా ఆ ప్రాంతమంతా కలిదిరుగుతోంది. అక్కడే ఉన్న “సఫా” “మర్వా” కొండలపైకి ఎక్కిదిగుతూ గుక్కెడు నీళ్ళయినా దొరికితే బాగుండునని అలమటించేది. అప్పుడు దైవానుగ్రహం మేరకు అక్కడ హజ్రత్ ఇస్మాయిల్ కాలిమడమల వద్ద ఒక నీటి ఊట చిమ్ముతుంది. ఆ నిర్జలమైన ఎడారిలోనే నీటి చెలిమెను సృష్టించారు. ఇప్పటికి హజ్ యాత్రలో ముస్లీంలు పవిత్ర జలంగా సేవించే ఆ నీటి చెలిమె పేరే ఝమ్ ..ఝమ్. అదే ఊట ఒక సెలయేరుగా మారి నేటికి స్థిరంగా ఉంది. హజ్ యాత్రకు వెళ్లే లక్షలాది మంది ఆ పవిత్ర జలాన్ని సేవించడమే కాక తమ దేశాలకు తీసుకు వెళ్తారు. తరువాత కొంత కాలానికి హజ్రత్ ఇబ్రహీం తన భార్య బిడ్డలను కలుస్తారు. హజ్రత్ ఇబ్రహీం మరోమారు విషమ పరీక్షను ఎదుర్కొవల్సి వస్తుంది. తన ముద్దుల తనయున్ని దైవ ప్రసన్నత కోసం బలిస్తున్నట్లు ఇబ్రహీం కలగంటారు. తన స్వప్నాన్ని నిజం చేయదలిచి తనయుడు హజరత్ ఇస్మాయిల్ కు వివరిస్తారు. తండ్రికి తగ్గ ఆ తనయుడు తన ఆత్మార్పణలోనే దైవ ప్రసన్నత ఇమిడి ఉంటే తాను సర్వదా సంస్థిదుడని, అజ్ఞాపించిన ఆ అల్లాహ్ నే నాకు సహనం వహించే సద్బుద్ధిని ప్రసాదిస్తాడని సమాధానమిచ్చాడు. ఇస్మాయిల్ నోట ఈ మాట విన్న ఆ తండ్రికి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు జలజలారాలాయి. కేవలం కలలో కనిపించిన సంకేత దృశ్యాన్ని దైవాజ్ఞగా భావించి,ఓ తండ్రి కన్న కొడుకును దైవ మార్గంలో అర్పించడానికి సిద్ధపడటం, అదేవిధంగా కన్నతండ్రి కలను సాకారం చేయడానికి ఓ కొడుకు ప్రాణ త్యాగానికి సంసిద్ధుడవడం మానవజాతి చరిత్రలోనే ఓ అపూర్వమైన, అద్భుతమైన పరిణామం. తండ్రి కొడుకుల ఈ చర్యకు దేవుడు ఎంతగానో సంతోషించాడు. హాజ్రత్ ఇబ్రహిం కళ్ళకు గంతలు కట్టుకొని దైవ మార్గంలో  కొడుకును జిబాహ్ చేయడానికి సిద్ధపడుతారు. అప్పుడు దైవవాణి వినిపిస్తోంది.
ఓ ఇబ్రహీం నీవు నీ కలను నిజం చేసి చూపించావు. దైవ సందేశం విన్న ఇబ్రహీం కళ్ళగంతలు తీసి చూస్తారు. తన కుమారుడికి బదులు గోర్రె పోతు జిబాహ్ చేయబడి ఉండటం తన కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ తేజంతో వెలిగిపోవడం చూసి ఆనందపడతాడు. నర్వమానవాళికి ఆయనను నాయకుడిగా చేస్తారు. హజ్రత్ ఇబ్రహిం చేసిన మహోన్నత సాంప్రదాయాన్ని కొనసాగింపుగా నేటికి ముస్లింలు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వరిస్తుంటారు. అదే ఖుర్బానీ.  ఖుర్బానీచేసిన జంతువు మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం బందుమిత్రులకు పంచాలీ, ఒక భాగం నిరుపేదలకు, మిగిలిన భాగం ఇంటి కోసం వాడుకోవాలి. ఇబ్రహీం ఆరాధన కోసం నిలబడిన ప్రదేశాన్ని శాశ్వత సమాజు స్థలంగా చేసుకోమని ప్రపంచ మానవాళికి అల్లాహ్ ఆదేశించాడు. సృష్టికర్త ఆజ్ఞ మేరకు ఆయన మార్గంలో ఆద్వితీయమైన త్యాగానికి సిద్ధపడిన పరివారం త్యాగనిరితి ఈ పర్వదినానికి నేపథ్యం. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కన్న బిడ్డను దైవ మార్గంలో త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ తల్లి బీబీ హజరా,తండ్రి హజ్రత్ ఇబ్రహిం తనను తాను దైవ ప్రసన్నత కోసం సమర్పించుకునేందుకు సిద్ధపడిన తనయుడు హజ్రత్ ఇస్మాయిల్ ల ఆద్వితీయ బలిదానం ఈ పండుగలోని ప్రాశస్త్యం. నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా దైవ పరీక్షలకు ఎదురు నిలిచి హజ్రత్ ఇబ్రహీం చెరగని ముద్ర వేసుకొని ముస్లీం సోదరుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని  సంపాదించుకున్నా మహోన్నత వ్యక్తిగా ఎదిగారు.
పవిత్ర హజ్ మాత్ర మక్కాలో: ఇస్లామిక్ సంవత్సరాది ప్రకారం జిల్ హజ్ మాసంలోని పదవ రోజున జరిగే బక్రీద్ పండుగనాడు విశ్వాసులందరి హృదయాలు ఇబ్రహీం త్యాగనిరీతిని తల్చుకుంటూ పులకించిపోతాయి. ఇదే రోజున పవిత్ర మక్కా నగరంలో హజ్ ఆరాధనోత్సవం జరుగుతుంది. మక్కాను సందర్శించే స్థోమత లేని వాళ్ళు తాము ఉన్న చోటనే ప్రత్యేక నమాజులు చేస్తారు. ఖుర్బానీ ఇచ్చి అల్లా విశ్వాసానికి పాత్రులు అవుతారు. ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది హజ్ కు వెళ్లి కాబాను దర్శించుకుంటారు.