అమరావతి : విశాఖ రుషికొండపై నిర్మాణాలు పూర్తిగా వ్యక్తిగతంగా ఉన్నాయని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రుషికొండపై కట్టిన భవన నిర్మాణాలను కూటమి నాయకులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మీడియాతో మాట్లాడుతూ ఏడు బ్లాకులుగా చేపట్టిన ఈ నిర్మాణాలలో మూడు బ్లాకుల్లో జగన్‌మోహన్ రెడ్డి అత్యంత విలాసవంతమైన గృహ సముదాయాన్ని నిర్మించుకోగా మిగిలిన నాలుగు బ్లాకుల్లో ఒకటి సిఎంఒ కార్యాలయానికి, ఒకటి ప్రధాన అధికారుల ఛాంబర్లకు, మిగిలిన రెండు బ్లాకులు సాధారణ అధికారుల కార్యాలయాలకు ఉండే విధంగా సుమారు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించారని తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తి సెంట్రల్ ఎసి కలిగి పూర్తి గ్రానైటెడ్ ఫినిషింగ్‌తో అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, భారీ స్క్రీన్లు, విలాసవంతమైన బెడ్రూంలు, బాత్రూంలు కలిగి ఉన్నాయన్నారు. ఈ కట్టడాల గురించి తెలుసుకుందామని గతంలో వస్తే వైసిపి ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని తెలిపారు. చంద్రబాబు, పవన్‌ను సైతం ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. పచ్చటి టూరిజం రిసార్ట్‌ను అన్యాయంగా కూల్చివేసి, విలాసవంతంగా కట్టడాలను కట్టారన్నారు. కొంతకాలం టూరిజం రిసార్ట్ అని, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమని చెబుతూ వచ్చారని తెలిపారు. రుషికొండ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ఆనాటి పర్యాటక మంత్రి రోజా చేశారన్నారు. ఈ నిర్మాణాలపై కోర్టులు వేసిన కమిటీ ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యంటూ నివేదిక ఇచ్చాయని వివరించారు. త్వరలోనే విశాఖలో సిఎం చంద్రబాబు పర్యటన ఉంటుందని, ఈ భవనాన్ని ఏం చేయాలో ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పంచకర్ల సందీప్, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.