నిత్య ప్రేర‌ణ‌

నిత్య ప్రేర‌ణ‌కమ్యూనిస్టు పార్టీ తీర్చిదిద్దిన వ్యక్తి, తిరిగి తాను కమ్యూనిస్టు పార్టీని ఉన్నతంగా తీర్చేందుకు తన జీవితకాలాన్ని ధారపోయటమే రుణం తీర్చుకోవటమంటే! అప్పుడే ఆ జీవితానికి సార్థకత, సమాజానికి మేలూ కలుగుతాయి. అలాంటి వ్యక్తిత్వాలనే మనం స్మరించుకుంటాం. ప్రేరణ నింపుకుంటాం. అందుకు నిలువెత్తు ఉదాహరణ కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు. ఎమ్మెచ్‌ అని అందరం పిలుచుకుంటుంటే ‘మెమరబుల్‌ హ్యూమనిస్టు’ నిఖార్సయిన కమ్యూనిస్టు మదిలో కదలాడుతాడు. కమ్యూనిస్టులు చేయలేని పనంటూ ఏదీ ఉండదు. అలసిన బిడ్డను ఎత్తుకోవడం నుండి సామాన్య కార్యకర్తను ఓదార్చేవరకు, చట్టసభలో గళమెత్తడం నుంచి అజ్ఞాతంలోనూ అలుపెరుగని పోరాటపు ధీరత్వం వరకూ అన్నీ చేస్తాడు. ఎం.హెచ్‌.లో అవన్నీ చూస్తాము. ఉద్యమాలకు మార్గదర్శిగా అతివాద, మితవాద అన్యధోరణులను ఎండగట్టిన సైద్ధాంతిక నిబద్దుడాయన. అంతేకాదు, అక్షరాల రూపశిల్పిగా ప్రజాగొంతుకను ప్రతిధ్వనింపజేసిన రచనాకోవిదుడు. ప్రజలను చైతన్యపరిచిన మహా వక్త. నిరతము ఉద్యమ ఆలోచనకు పదునుపెట్టినకర్త. ఆయనను తలుచుకుంటే మనస్సునిండా చైతన్యం ప్రవహిస్తుంది! అందుకే వర్థంతి రోజున ఈ స్మరణ.
ఘాటైన సమాధానం
కామ్రేడ్‌ సుందరయ్య అస్తమించిన తర్వాత జలగం వెంగళరావు మాట్లాడుతూ సుందరయ్య లేరు గనుక మార్క్సిస్టు పార్టీ పని అయిపోయిందని, అల్ప సంతోషం పొందారు. అందుకు కామ్రేడ్‌ యం.హెచ్‌ ఎలా ఘాటైన సమాధానం చెప్పారో చూడండి! ”ఏకో నారాయణ అంటూ పదవుల కోసం కుక్షింభరులవలే ఏ ఇందిరాగాంధీనో, రాజీవ్‌ గాంధీనో పట్టుకొని వేలాడడం కంటే పరమార్ధం లేని వెంగళరావుకు, ఆయన పార్టీకి అంతకు మించి బుర్ర పని చేయదు. కనుచూపు ఆనదు. కామ్రేడ్‌ సుందరయ్య గారు లాంటి మహా పురుషుడు ఆశించింది, నిర్మించిందీ తన చుట్టూ తిరిగే పార్టీని కాదు. మార్క్సిజం, లెనినిజం అన్న మానవాళి విముక్తి సిద్ధాంతాన్ని, విశ్వసత్యాన్ని, అంతర్జాతీయతను ఆయన శిరోధార్యంగా భావించి ఈ పార్టీని నిర్మించడానికి దోహదం చేశాడు. ఆయన ఆశయం పోయేది కాదు. ఆయన పార్టీ పోయేది కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఉద్యమం. నాటికీ, నేటికీ, భవిష్యత్‌కు అదే అనుసరణీయం.”
– పాటూరు రామయ్య
విప్లవజ్వాల
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ఒక పరీక్ష. ఆ పోరాటంలో దెబ్బలకు దడిచి రహస్యాలు చెప్పి పార్టీకి నష్టం కల్గించే వాళ్ళను ఆయన క్షమించలేదు. వారిని పార్టీలోకి తీసుకోమని (నాటి) కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ చెప్పినా ఫార్మల్‌గా తీసుకున్నా అటువంటి వారిని పరాయి వారుగానే చూసేవారు. గడ్డు పరీక్షలకు నిలువలేని వాడు విప్లవకారుడు కాలేడు. ఆ విశ్వాసమే చివరి వరకు ఆయన దృక్పథంలో మెదిలేది. మార్క్సిజం యొక్క స్వచ్ఛతని, సత్యాన్ని ఆయన పాటించేవారు. మూడో పేజీలోని సంపాదకీయాలు – వజ్రపు తునకలు, పోరాట జ్వాలలు, సైద్ధాంతిక వేదికలు. ఆ పేజీ కోసమే ప్రతి ఒక్కరు ఎదురుచూసేవారు, చదివేవారు. వాడి వేడి పదజాలంతో సంపాదకీయాలు ఉండేవి. ఆ ఘనత సంపాదకుడైన ఎంహెచ్‌దే. ఆ పదునైన భాష, రాజకీయ విజ్ఞత అనితర సాధ్యం. ఆయన దీర్ఘకాలం జైళ్ళలో గడిపారు. కాల్పులకు గురైనారు. అయినా విప్లవజ్వాల మరింత ప్రజ్వరిల్లిందేగాని వారి విప్లవ స్థైర్యాన్ని చెక్కుచెదరనివ్వలేదు.
– నండూరి ప్రసాదరావు
ఆచరణ, అన్వయింపు
1952లో అవిభక్త మద్రాసురాష్ట్ర శాసనసభకు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అప్పటి మంత్రి కల్లూరి చంద్రమౌళిని ఓడించి ఎన్నికైన నాటి నుండి ఇటీవల రాజ్యసభ సభ్యత్వం పూర్తయ్యేవరకూ చట్ట సభలలోనూ, కార్యక్షేత్రంలోనూ, పత్రికలలోనూ ఈ సిద్ధాంతాలను బోధించడం ఆచరించడం, అన్వయించడమే దినచర్యగా దాదాపు 53 సంవత్సరాలు గడిపిన ఎంహెచ్‌ తొలితరం కమ్యూనిస్టు నాయకులలో ఒకరు.
– వార్త సంపాదకీయం
(20.06.2001)
కనిపించని కళాకారుడు, సాహితీవేత్త
వర్గ నైశిత్యం, రాజకీయ పరిణతి, వాస్తవిక దృక్పధం ఇవన్నీ కలిస్తే కామ్రేడ్‌ ఎం.హెచ్‌. ఆశయం, అక్షరం, ఆచరణ, అనుభవం అన్నీ కలగలసిన అరుదైన నాయకుడు ఎం. హెచ్‌. ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీల పాత్ర వహిస్తూనే ప్రతి అక్షరాన్ని ప్రత్యర్థులపై పిడుగుపాటుగా, కార్యకర్తల అవగాహనకు వెలుగుబాటగా మలచిన మహాశిల్పి ఎం.హెచ్‌. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ వైభవ ప్రాభవాలకు విచ్ఛిన్నాలకు, పునరుజ్జీవానికి సాక్షీభూతంగా నిలిచిన నిన్నటి తరం నేత, నేటి తరం మార్గదర్శి ఎం.హెచ్‌.
కార్మికవర్గ పోరాటం అనేక రంగాలలో జరుగుతుందని అందులో అతి భీషణ భాగం సైద్ధాంతిక రంగంలో వుంటుందని లెనిన్‌ అంటారు.. దీర్ఘకాలంపాటు అజ్ఞాతవాసాలు, కారాగృహక్లేశాలు అనుభవించి కాకలుతీరిన కామ్రేడ్‌ ఎమ్‌.హెచ్‌. పాలకవర్గాలపైనా మితవాద, ఉగ్రవాద విచ్ఛిన్నాల పైనా సైద్ధాంతికంగానూ అంతే తీవ్రంగా పోరాడారు. అన్యవర్గ సిద్ధాంతాల బండారం కళ్లకు కట్టి చూపారు గనకే రెండు మహావిచ్చిన్నాల తర్వాత కూడా రాష్ట్రంలో పార్టీ పునాదులు కాపాడగలిగారు. పార్టీ రాజకీయ కర్తవ్యాలను, పత్రికా ధర్మాలను ఎలా సమతుల్య పరచాలనే దానిపై ఆయనకు ఎప్పుడూ స్పష్టత వుండేది.
ఎం.హెచ్‌ కనిపించని కళాకారుడు. తెలుగు సాహిత్య, సాంస్కృతిక పునర్వికాసానికి కమ్యూనిస్టుపార్టీ జరిపిన కృషిలో ఆయన ఒక ముఖ్యపాత్రదారి. మిక్కిలినేని, నాజర్‌, సాలార్‌, కర్నాటి తదితర సీనియర్‌ కళాకారులందరి రచనల్లో ఆయన ప్రస్తావన కనిపిస్తుంది.
దిగంబర కవిత్వంపైనా, విరసం పైనా ఆయన విశ్లేషణలు అందరికీ తెలిసినవే. ప్రజానాట్యమండలి పునరుద్ధరణలో ముఖ్యపాత్ర వహించిన ఎం.హెచ్‌ సదా దానికి సలహాలు సూచనలు చేస్తుండేవారు. రచనా శక్తి, కళాత్మక ప్రతిభ కలవారు ఎవరు కనిపించినా కనిపెట్టి ప్రోత్సహించేవారు. ఉదయంగారు కూడా బుర్రకథలు చెప్పడం యాదృచ్ఛికం కాదు.
– తెలకపల్లి రవి
కొత్తతరం నిర్మాత
మోటూరు హనుమంతరావు సంపాదకులుగానే కాదు ప్రముఖ రచయిత, అనువాదకులు, రాజకీయ విశ్లేషకులు అన్నింటికన్నా మించి స్వార్ధరహిత రాజకీయ నాయకులు. ఆర్గనైజర్‌ కూడాను. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా విచ్చిన్నాలను ఎదుర్కొని పార్టీని నిలబెట్టారు. పార్లమెంటేరియన్‌గా ప్రజల తరుపున అసెంబ్లీ, పార్లమెంట్‌లో పోరాడారు. కళలు, సాహిత్యంపై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది. ఆ విధంగా విభిన్న రంగాల్లో ఆరితేరిన సవ్యసాచి విప్లవోద్యమాల నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒక్కరు.
సంపాదకుడిగా జర్నలిస్టు రంగంలో అనేక మంది ‘యువతీ యువకులను ఆయన ప్రోత్సహించారు. ప్రజాశక్తి దినపత్రికగా మారిన తర్వాత విద్యార్థి రంగంలో ఉన్న అనేక మంది కార్యకర్తలను గుర్తించి వారిని సంపాదకవర్గంలోకి తీసుకుని నిపుణులుగా మారేలా పదునుపెట్టారు. ఇప్పటి వరకు సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించిన పాటూరు రామయ్య, వి ఆర్‌ బొమ్మారెడ్డి, ఎస్‌.వినయ కుమార్‌, తెలకపల్లి రవి, ఎస్‌.వెంకట్రావు లాంటి ఎందరో ఆయన మార్గదర్శకంలో రాటుతేలిన వారే. ఎమ్‌.హెచ్‌ను సన్నిహితంగా ఎరిగిన అనేకమంది జర్నలిస్టుల గుండెల్లో ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నారు.. ముఖ్యంగా వారికి ఆత్మవిశ్వాసం కల్పించి నిలబెట్టడంలో ఆయన పాత్ర వెలలేనిది. తప్పులు చేస్తే సున్నితంగా మందలించేవారు.. కార్యకర్తలు, సిబ్బందిపట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించేవారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరితో సన్నిహితంగా మెలిగేవారు.
– వి. శ్రీనివాసరావు
కమ్యూనిస్టు రచయితగా, సంపాదకులుగా…
1948లో కార్యదర్శివర్గ సభ్యుడైనప్పటి నుండే ఎంహెచ్‌ తీర్మానాలు, డాక్యుమెంట్లు, ప్రకటనల ముసాయిదాలను తయారుచేసే బాధ్యత చేపట్టారు. స్టాలిన్‌ యుగంవంటి పుస్తకాలను అనువదించారు. 1948లో ప్రజాశక్తి నిషేధానికి గురైన తర్వాత ప్రారంభమైన జనతా పత్రికకు తొలి సంపాదకీయాన్ని ఎంహెచ్‌ రాశారు. తరువాత ఆయనే జైల్లో పడ్డారు. 1953 జూన్‌లో తణుకులో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభ కామ్రేడ్‌ ఎంహెచ్‌ను రాజకీయ సంపాదకునిగా ఎన్నుకొన్నది. ఆ విధంగా ఆనాటి నుండి వారపత్రికలైనా, దినపత్రికలైనా అవి ఎంహెచ్‌ పేర నడచినా నడవకపోయినా, ఆయన జైల్లో వున్నా, రహస్యంగా వున్నా, శాసనసభ్యుడిగా వున్నా, పార్టీ కార్యదర్శిగా వున్నా విశాలాంధ్రకు, జనశక్తికి, ప్రజాశక్తికి రచనలు చేస్తూ, సంపాదకీయాలు రాస్తూ వచ్చారు. విశాలాంధ్ర సంపాదకుడిగా వుంటూనే పార్టీలో రివిజనిజానికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం జరిపారు. ఆ పోరాట ఫలితం సంపాదకులుగా ఆయన పనికి కూడా తీవ్రమైన అంతరాలు కలుగజేసింది… భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణలు సందర్భంగా అరెస్టయిన తర్వాత 1963లో జైలునుండి బయటకు వచ్చిన ఎంహెచ్‌ సంపాదకత్వంలో జనశక్తి పత్రిక ప్రారంభమైంది. పార్టీలో ప్రారంభమైన ఉగ్రవాదం జనశక్తిని కూడా తన్నుకుపోవడంతో ఎడాపెడా ధోరణులను అధిగమించి ప్రజల వర్గపోరాట సాధనంగా మళ్ళీ ప్రజాశక్తిని 1968 జూలై 27న వార పత్రికగా పునరుద్ధరించారు. పార్టీ కార్యదర్శిగానే వుంటూ ప్రజాశక్తి వారపత్రికలో ఎంహెచ్‌ ”కంచుకాగడా”, ”పలుకులూ ములుకులు”, ”తీరుతెన్నులు” వంటి శీర్షికలతో అనేక వ్యాసాలు, వ్యాఖ్యానాలు రాశారు. సైద్ధాంతిక విషయాలపై ఆయన రాసిన సంపాదకీయాలు కరకుకరవాలాల్లా వర్గ శతవులను చీల్చి చెండాడేవి. గుంటూరు జిల్లా కార్యదర్శి బాధ్యతల్నుంచి పొలిట్‌ బ్యూరో సభ్యత్వం వరకు వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన కామ్రేడ్‌ ఎంహెచ్‌కు ప్రజాప్రతినిధిగాను అపారమైన అనుభవం ఉండడం అరుదైన విశేషం. 1952 – 55 మధ్య ఎమ్మెల్యేగా 1978 – 84 మధ్య శాసనమండలి సభ్యుని గాను 1988 – 94 మధ్య రాజ్యసభ సభ్యునిగాను ఆయన ప్రతిభావంతంగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోనూ, మితవాద అతివాద పోకడలనుండి పార్టీని రక్షించుకోవడంలోనూ పార్టీ పత్రికను, రచనా వ్యాసాంగాన్ని సాధనంగా చేసుకుని అనేక చారిత్రక మూలమలుపుల్లో పార్టీ కేడర్లో సైద్ధాంతిక అవగాహన కల్పించడంలోనూ ఎంహెచ్‌ చూపిన నైపుణ్యం, చొరవ, పట్టుదల ఆయన త్యాగపూరితమైన, క్రమశిక్షణాయుతమైన జీవితం నేటికీ ఏనాటికీ ఆదర్శప్రాయం. ఆయన చూపిన బాటలో చివరి వరకు పయనించడమే ఎం.హెచ్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.
– ఎస్‌. వెంకట్రావు
రాజీపడని మానవీయుడు
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సరైనదని నమ్మిన మార్గాన్ని విడిచిపెట్టకుండా తన బాధ్యతలను నిర్వర్తించడమే గాక పార్టీ శ్రేయోభిలాషుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి విప్లవ కారునిగా, అందులో సంపాదకునిగా తన బాధ్యతలు ఆదర్శవంతంగా నిర్వహించి అభిమాన పాత్రులయ్యారు. మహాత్ముల గురించి ఒక మాట చెపుతూంటారు. అవసరం వచ్చినప్పుడు శరాఘాతంగా మాట్లాడాలి. అలాగే అవసరమైనప్పుడు కుసుమ కోమల స్పర్శతో ఒప్పించే ప్రయత్నమూ చేయాలి. ఆ రెండూ హనుమంతరావు గారి రచనల్లో ఆసక్తి గల వారు సులువుగానే గ్రహించవచ్చు. అంటే వివాదాల్లో నిక్కచ్చిగా, రాజీపడని పద్ధతుల్లో నడుస్తూ వ్యక్తిగత సంబంధాల్లో ఆత్మీయతకు, అనురాగాలకు అవకాశం కల్పించడం కూడా మానవీయ నైజం.
– సి. రాఘవాచారి
తుదివరకూ పోరాటం
ఏ ప్రజల శ్రమమీద మనం ఇంతగా ఎదిగామో, వారి రుణం తీర్చుకోవాలన్న జ్ఞానం మామూలు మనుషులకి చాలా ఆలస్యంగా కలగొచ్చు. కానీ అసాధారణ మానవులకు మాత్రం విద్యార్థి దశ నుండే ప్రజలందరికీ సుఖశాంతులనిచ్చే వ్యవస్థ కావాలనే ఆరాటం మొదలవుతుంది. మరో ప్రపంచ నిర్మాణం కోసం ఓ యోధుడిగా పోరాడాలనే గమ్యం ఏర్పడుతుంది. అలాంటి గమ్యం ఏర్పరచుకున్నా – తుదికంటా అందరూ నిలబడలేరు. వివిధ కారణాలవల్ల ప్రయాణం నుండి పక్కకు తప్పుకుంటారు. జీవితాంతం తాను నమ్మిన ఆశయం కోసం ప్రయాణం చేసేవారే ధన్యజీవులు. వయసు మీద పడిపోతుందికదా ఇంక రిటైర్‌ అవకూడదా అని అడిగితే ”ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ ఉంటుంది. కాని ఆశయాలకూ, ఆచరణకూ, నిబద్ధతకూ రిటైర్‌మెంట్‌ వుండదు. ఓపికున్నంత వరకూ ప్రజల కోసం పనిచేయటంలోనే విశ్రాంతి వుంది. ఇదే మాకు ఆనందం కూడా” అన్నారు. అయితే తుది క్షణం వరకూ ప్రజల కోసం ఆరాటపడటం అనేది ప్రజల మనుషులకే సాధ్యపడుతుంది.
– పి. చంద్రశేఖర్‌ ఆజాద్‌