ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు అన్ని కేటగిరి ప్రమోషన్ లో న్యాయం చేయాలి 

నవతెలంగాణ – చండూరు  
అడిక్వసీ జిఓను రద్దు పరచి ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులకు అన్ని కేటగిరి ప్రమోషన్లో న్యాయం చేయాలి అని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం అన్నారు. మంగళవారం  ఆయన విలేకరులతో మాట్లాడారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 85వ రాజ్యాంగ సవరణలు అనుసరించి యాక్ట్ 2001 ఆర్టికల్ 16 4(ఎ) అనుసరించి జీవో నెంబర్ 5 ద్వారా 14 ఫిబ్రవరి 2003 నుండి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఈ జిఓ ద్వారా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లో ఉన్నత హోదాలు దక్కినాయి.దీనిని జీర్ణించుకోలేని వారు అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జీవో నెంబర్ 2,   జనవరి,  9న  2004  ద్వారా అడక్వసి అను పదం సాకుగా చూపి చాలినంత కోట అనగా ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం దాటనీయకుండా ఓపెన్ మెరిట్లోకి రానీయకుండా కేవలం 15%, 6% మాత్రమే అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రతిభ అందరికీ సమానమని 50% ఓపెన్ మెరిట్ లో ఉన్న అన్ని కులాల వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి అన్నారు. ఓపెన్ మెరిట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీలను  కూడా జిఓ నెంబర్ 2 అడక్వసి అడ్డుపెట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు బదిలీ చేస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు అన్నారు.ఈ అడక్వసి  జీవో నెంబర్ 2 ను అడ్డుపెట్టి ప్రస్తుతం(2024)  జరుగుతున్న ఉపాధ్యాయుల ప్రమోషన్స్ అన్ని కేటగిరిలో అన్ని సబ్జెక్టుల వారిగా మేనేజ్మెంట్ వారిగా మీ కోట పూర్తి అయిందంటున్నారు. సీనియార్టీ లిస్టులో ఓపెన్ మెరిట్ లో ఉన్నప్పటికీ అన్ని జిల్లాల సీనియార్టీలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పేర్లు లేకుండా చేస్తున్నారన్నారు . దీని ద్వారా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు నింపుతున్న ఈ అడక్వాసి అడ్డు వల్ల న్యాయం జరగట్లేదు అని చెప్పవచ్చు. కావున జీవో నెంబర్ 2 లోనీ అడక్వసి అను పదాన్ని తొలగించి ఓపెన్ మెరిట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఓపెన్ లోనే కేటాయించి మిగతా అభ్యర్థులను ఎస్సీలకు 15 శాతం ఎస్టిలకు 10 శాతం తో ప్రమోషన్ల కోట నింపాలని  ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారు.అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సర్వీస్ కాలాన్ని మొదటి అపాయింట్మెంట్ తేదీ నుండి లెక్కింపు చేసి వారికి ప్రమోషన్లో న్యాయం చేయాలి.