ఐటీ కంపెనీలకు కార్మిక చట్టాల సడలింపు సరికాదు

– ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి
– కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదినికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐటీ కంపెనీల్లో కార్మిక చట్టాల సడలింపు సరిగాదనీ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదినికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనాలు పెంచకుండా యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గటం, మోడీ సర్కారు తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తామని పత్రికలకు లీకులివ్వడం, ఐటీ పరిశ్రమలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపునివ్వడం వంటి కార్మిక వ్యతిరేక చర్యలను వీడాలని కోరారు. పని వేళలు, పని ప్రదేశంలో భద్రత, రవాణా సౌకర్యాలు, వేతనాలు, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి షరతులను అమలు చేయాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడం దారుణమన్నారు. సౌకర్యాల కల్పన అమలుపై ఐటీ పరిశ్రమల్లో కార్మిక శాఖ ఎందుకు తనిఖీలు చేయడం లేదని అడిగారు. రాత్రి షిఫ్టుల కారణంగా మహిళలు ఎక్కువగా అసౌకర్యానికి గురవుతున్నారనీ, అందుకే చాలామంది షిఫ్ట్‌ డ్యూటీలను ఇష్టపడరని తెలిపారు. కంప్యూటరైజేషన్‌, పరిశ్రమల్లో అధునాతన యంత్రాల ఆవిష్కరణ జరిగినపుడు పనిగంటలు తగ్గాలి గానీ పెరగడమేంటని ప్రశ్నించారు.