ప్రజా చట్టాల అమలుపై మోటూరు ముద్ర

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌
– ఘనంగా కామ్రేడ్‌ మోటూరు హనుమంతురావు
నవతెలంగాణ – వనపర్తి
ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంటులను ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావడంలోనూ, ఆ చట్టాలను అమలు చేయడంలోనూ కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు ముద్ర ఎప్పటికీ ఉంటుందని సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం. డి. జబ్బార్‌ అన్నారు. సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు 23వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహా వ్యక్తి అని, కమ్యూనిస్టు పార్టీ తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన అన్నారు. ఆయన ప్రజా సమస్యలపై అసెంబ్లీ, పార్లమెంటులో పలు అంశాలపై చర్చించి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రజాశక్తి సంపాదకులుగా ఉంటూ రైతు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వ ని నిలదీస్తూ రాసేవారన్నారు. మితవాద, అతివాద పోకడల నుండి పార్టీని రక్షించుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేత మోటూరు హనుమంతరావు గారని వారన్నారు. వారి స్ఫూర్తితో రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ విస్తరణకు కృషి చేయాలని కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి బాల్‌ రెడ్డి, నాయకులు ఉమా, సాయి లీల, బాల పేరు, పురుషోత్తం, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.