అందరి దృష్టి అమెరికాపైనే..

అందరి దృష్టి అమెరికాపైనే..– నేడు దక్షిణాఫ్రికాతో తొలి సూపర్‌-8 మ్యాచ్‌
– రాత్రి 8.00గంటలకు
ఆంటిగ్వా: ఐసిసి టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌ లీగ్‌ పోటీలు ముగిసాయి. లీగ్‌ దశ పోటీలు ముగిసిన అనంతరం ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన 8జట్ల మధ్య సూపర్‌-8 సమరం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సూపర్‌-8లో ప్రతి జట్టు ఆ గ్రూప్‌లో మూడేసి మ్యాచ్‌లు చొప్పున ఆడనుంది. మూడు మ్యాచ్‌లు ముగిసిన అనంతరం ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌ఫైనల్‌కు చేరనున్నాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చి అమెరికా సూపర్‌-8కు చేరగా.. మరో ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌ కూడా గ్రూప్‌-సిలో నాలుగు వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలిచి సూపర్‌-8కు చేరింది. ఈ క్రమంలో అమెరికా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో సూపర్‌-8 సంగ్రామం మొదలు కానుంది. గ్రూప్‌-1లో భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌… గ్రూప్‌-2లో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, అమెరికా జట్లు ఉన్నాయి.
పూరన్‌ మెరుపు ఇన్నింగ్స్‌..
గ్రూప్‌-సి ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు 104పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన నామమాత్రపు గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌(98; 53బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 218పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. పూరన్‌కి తోడు ఛార్లెస్‌(43), హోప్‌(25), పావెల్‌(26) బ్యాటింగ్‌లో రాణించారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లు గులాబుద్దిన్‌కు రెండు, నవీన్‌-ఉల్‌-హక్‌, అజ్మతుల్లాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘన్‌ జట్టు 16.2ఓవర్లలో 114పరుగులకే కుప్పకూలింది. జడ్రాన్‌(38), ఒమర్జారు(23) టాప్‌ స్కోరర్స్‌. విండీస్‌ బౌలర్లు మెక్‌ కొరుకు మూడు, మాటీ, హొసైన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పూరన్‌కు లభించింది. దీంతో గ్రూప్‌-సిలో వెస్టిండీస్‌ జట్టు వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలను నమోదు చేసుకొని 8పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం
టి20 ప్రపంచ కప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం తెరపైకి వచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం కెన్యా మాజీ క్రికెటర్‌ ఉగాండా జట్టు ఆటగాడిని సంప్రదించగా.. ఈ విషయాన్ని ఉగాండా ఆటగాడు వెంటనే ఐసిసి అవినీతి నిరోధక విభాగానికి తెలియజేసినట్లు సమాచారం. టి20 ప్రపంచ కప్‌లో భాగంగా గయానా వేదికగా ఉగాండా మూడు లీగ్‌ దశ మ్యాచ్‌లు ఆడింది. ఆ సందర్భంగా కెన్యా మాజీ పేసర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం పలుమార్లు వేర్వేరు నంబర్లతో ఉగాండా ప్లేయర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాడట. ఈ విషయాన్ని సదరు ప్లేయర్‌ ఐసీసీ అవినీతి నిరోధక బందం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేపడతామని ఐసిసి తెలిపినట్లు సమాచారం. టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌-సిలో ఉన్న ఉగాండా.. నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించింది.