జియో నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం

జియో నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం– కస్టమర్‌ కేర్‌ స్పందన కరువు
– వాపోయిన వినియోగదారులు
ముంబయి : ముకేష్‌ అంబానీకి చెందిన రియలన్స్‌ జియో మొబైల్‌ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పాడింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి సమస్య ఉత్పన్నం కావడంతో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. జియో ఫైబర్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం చోటు చేసుకుంది. దీనికి గల స్పష్టమైన కారణాలను ఆ కంపెనీ వెల్లడించలేదు. సేవలపై వినియోగదారులు కస్టమర్‌ కేర్‌ను సంప్రదించిన సరిగా స్పందించడం లేదంటూ వాపోయారు. ఇతర నెట్‌వర్క్‌ల సహాయంతో సోషల్‌ మీడియా వేదికల్లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జియో సర్వీసులు నిలిపోవడంతో మీమ్స్‌ వెల్లువెత్తాయి. దాదాపు 3వేల మందికిపైగా జియో సర్వీసులు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. జియో నెట్‌వర్క్‌ డౌన్‌ కావడంతో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వాట్సాప్‌ పని చేయకుండా పోయింది. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, ఎక్స్‌, గూగుల్‌, యూట్యూబ్‌ సహా పలు సర్వీలను వినియోగించుకోలేకపోయామని వినియోగదారులు ఆందోళన పడ్డారు. మొబైల్‌ ఇంటర్నెట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. మరో 38శాతం జియో ఫైబర్‌, ఏడు శాతం మొబైల్‌ నెట్‌వర్క్‌లో సమస్య ఉత్పన్నమైనట్లు ఫిర్యాదు చేశారు.