కుల జనగణన అనంతరమే..స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

– వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు రాయబండి పాండురంగచారి డిమాండ్‌
నవతెలంగాణ – ఎల్బీనగర్‌
కుల జనగణన అనంతరమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు రాయబండి పాండురంగచారి డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కొత్తపేట వర్కర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.వెంకటస్వామి గౌడ్‌ అద్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాయబండి పాండురంగ చారి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన అనంతరమే స్థానిక సంస్థల్లో 43% బీసీ రిజర్వేషన్‌ అమలు ద్వారా బీసీ, ఎంబీసీలకు వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ద రిజర్వేషన్లు ఉండడం వలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానానికి రాణించగలుగుతు న్నారని వెల్లడించారు. దేశ జనాభాలో దాదాపు 60% ఉన్న బీసీ జాతులకు అసెంబ్లీ పార్లమెంట్‌ లాంటి చట్టసభలకు రాజ్యాంగపర రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే బీసీ సమాజం వెనుకబాటుకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అభివద్ధి చెందిన జాతి మాత్రమే ఆర్థిక, సామాజిక, సాంస్కతిక రంగాల్లో అభివద్ధి సాధించిగలదని చరిత్ర చెబుతున్న సత్యమిదేన్నారు. అయితే ఆధిపత్య కులాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీల కనుసన్నులలో మెదిలే రాజకీయ బానిసల పట్ల స్వయం గౌరవం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా బీసీ సమాజానికి ఈ బానీసల నుండి మొదటి ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ లాంటి ఆధిపత్య కులాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీల్లో పని చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ జాతి ప్రజల ప్రయోజనాల కంటే తమ బంధువులు, వారసుల కోసమే జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సంకేటి శంకర్‌, శంకర్‌ గౌడ్‌, రవీందర్‌ గౌడ్‌, నాగన్న, రవీందర్‌, ధనంజయ, కుమ్మరి మంజుల, కుమ్మరి పద్మమ్మ, ముంత జ్యోతి, శ్యాంపల్లి సురేష్‌, సాగర్‌, జయలక్ష్మి, శ్రీలత, శ్వేత, భారతమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.