ఎన్నికల విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికసాయం

– రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల విధుల్లో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఉద్యోగులు మరణించారనీ, ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.రూ.1.95 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని తెలిపారు.
ఫలించిన టీఎస్‌యూటీఎఫ్‌ ప్రాతినిధ్యం
ఎన్నికల శిక్షణ, పోలింగ్‌ సందర్భంగా వడదెబ్బ, రోడ్డు ప్రమాదాలు, గుండె, మెదడు సంబంధిత సమస్యలతో హఠాన్మరణానికి గురైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేసింది. ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గతనెల 14న హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ ప్రాతినిధ్యం ఫలించింది. అందుకు స్పందించిన ఎన్నికల కమిషన్‌ మరణించిన ఉద్యోగులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు.