నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ)గా డీఈడీ, బీఈడీ అర్హతలతో నియామకమైన ఉపాధ్యాయులందరికీ సీనియార్టీ ప్రకారం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్‌హెచ్‌ఎం)గా పదోన్నతి అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ మేరకు 11, 12 జీవోలను సవరించాలని కోరింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పది వేలకు పెంచుతామంటూ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతుల్లో ఒక ఎస్జీటీ ఉపాధ్యాయునికి బహుళ సబ్జెక్టుల్లో పదోన్నతి అర్హత ఉంటే సీనియార్టీ ప్రకారం వెబ్ కౌన్సెలింగ్‌లో అన్ని సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల సీనియార్టీలో దిగువన ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు పదోన్నతి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరికి ఒక సబ్జెక్టులో మాత్రమే పదోన్నతి ఇచ్చి మిగిలిన సబ్జెక్టుల్లో పేరు తొలగించి తదుపరి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతి ఇవ్వాలని సూచించారు. ఆ మేరకు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు.న