వర్షాల నేపథ్యంలో వ్యాధులు పెరిగే ప్రమాదం

– జాగ్రత్తలు తీసుకోండి : ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదముందని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ బి.రవీందర్‌ నాయక్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణంలో తేమ శాతం పెరగడంతో వైరల్‌ ఇన్ఫెక్షన్లు, దోమలు, ఆహార, నీటి సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదముందని తెలిపారు.
మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా తదితర దోమల ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా దోమతెరలు, స్క్రీన్‌లు ఉపయోగించాలని సూచించారు. దోమలు పెరిగేందుకు ఎక్కువగా అవకాశమున్న ఉదయం, సాయంత్రం వేళల్లో తలుపులు, కిటీకీలు సరిగ్గా మూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు తేలిక రంగులతో కూడిన దుస్తులను వేయాలనీ, అవి కూడా చేతులను, కాళ్లను పూర్తిగా కవర్‌ చేసేలా చూసుకోవాలని పేర్కొన్నారు. బయటికి వెళ్లే సమయంలో మస్కిటో రిపెల్లెంట్‌ క్రీములను ఉపయోగించాలని సూచించారు.
”వర్షాకాలంలో నీటి సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముంది. బయటి నీరు తాగకుండా ఇంట్లో కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు, తర్వాత, వాష్‌ రూం ఉపయోగించునే సమయంలో తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. బయటి ఆహారాన్ని తీసుకోవద్దు. ముఖ్యంగా సగం కోసినవి, కవర్‌ చేయని వాటి జోలికి వెళ్లొద్దు …” అని రవీందర్‌ నాయక్‌ సూచించారు. తద్వారా జాండీస్‌, టైఫాయిడ్‌ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని తెలిపారు.
” వర్షాకాలంలో వైరల్‌ ఫీవర్లు కూడా ప్రజలను పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతుంటాయి. అనారోగ్యంతో ఉన్నవారితో చేతులు కలపడం, ఆహారం, నీరు, దుస్తులు పంచుకోవడం లాంటివి చేయకూడదు. ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. తుమ్మినా, దగ్గినా ఇతరులు ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా మూతిని కవర్‌ చేసుకోవాలి. దగ్గు, జలుబు ఉంటే డిస్పోజబుల్‌ టి ష్యూలను ఉపయోగించుకోవాలి. ఒక వేళ జ్వరంతో పాటు దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రులను సంప్రదించాలి. అత్యవసరమైతే 108 అంబులెన్స్‌కు కాల్‌ చేయాలి.” అని డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ సూచించారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఆయా వ్యాధుల బారిన పడితే ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి తగ్గించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని డాక్టర్‌ బి.రవీందర్‌ నాయక్‌ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్లు, అత్యవసర మందులు, అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఉపయోగించుకునేందుకు ఏఎన్‌ఎం, ఆశాలు, అంగన్‌ వాడీలకు ఓఆర్‌ఎస్‌ సాచెట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు.