20 శాతం మించకుండా బదిలీలు చేయాలి

– తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఉద్యోగులు, డాక్టర్ల బదిలీల్లో 20 శాతం మించకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్‌ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని వైద్యవిద్య సంచాలకుల కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్‌ (2024-26) అధ్యక్షులు డాక్టర్‌ ఎ.కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.రంగా, కోశాధికారి డాక్టర్‌ టి.శంకర్‌ సింగ్‌, జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ పి.ప్రవీణ్‌, డాక్టర్‌ బి.రమేశ్‌, డాక్టర్‌ లక్ష్మినారాయణ తదితరులు మాట్లాడారు. 20 శాతానికి మించి అనుమతిస్తే అత్యవసర సేవలు, రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేసిన బదిలీలు కూడా 20 శాతానికి మించి చేయలేదని గుర్తుచేశారు. గతంలో ఇచ్చినట్టుగానే ఉద్యోగ సంఘం సభ్యులకు బదిలీల నుంచి ఖచ్చితంగా మినహాయింపునివ్వాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం తమదేననీ, వేరే ఇతర గుర్తింపు లేని సంఘం డీఎంఈ ద్వారా సిఫారసు చేయించుకుంటున్నట్టు తెలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బదిలీల పేరుతో లక్షలాది రూపాయల వసూళ్లు చేస్తున్నారనీ, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తమపై అనవసర ప్రచారం మానుకోవాలనీ, ఆర్థికశాఖ ఇచ్చే ఉత్తర్వుల అమలుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. అడిషనల్‌ డీఎంఈ, ఇతర పదోన్నతులు చేపట్టిన తర్వాతే బదిలీల ప్రక్రియ చేయాలని సూచించారు.
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. కొత్త వైద్యకళాశాలల్లో పని చేసే డాక్టర్లకు 30 శాతం నుంచి 50 శాతం అదనంగా వారి బేసిక్‌ పేపై అలవెన్స్‌ ఇస్తూ జీవో జారీ చేయాలని కోరారు. గతంలో డాక్టర్లకు ఇచ్చిచన ట్రాన్స్‌ పోర్ట్‌ అలవెన్స్‌, ఈఎల్‌ సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ అలవెన్స్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఏ ప్రభుత్వ వైద్యులైన స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకుంటే వారికి వెంటనే అనుమతితో పాటు అన్ని రకాల ప్రతిఫలాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.