– పర్యావరణ పరిరక్షణపై అవగాహన
– 24 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
– ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
– కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు అప్లోడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ‘మేరి లైఫ్’ పథకంలో భాగంగా ఈ ఏడాది ‘పర్యావరణ దినోత్సవం-భూమి పునరుద్ధరణ’ పేరుతో కార్యక్రమాలను ప్రకటించింది. ఈ మేరకు ‘సమగ్ర శిక్ష’ ఆధ్వర్యంలో సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారు పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు రోజువారీ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ విషయాలపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వారం రోజులపాటు కార్యక్రమాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక స్కూల్స్ 375, ప్రాథమికోన్నత స్కూల్స్ 22, ఉన్నత పాఠశాలలు 108 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 90వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యనిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం నుంచే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎకో క్లబ్‌ల ఆధ్వర్యంలో పర్యావరణ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రతిరోజూ ఒక్కో అంశం ఆధారంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎకో క్లబ్‌ల ఆధ్వర్యం లో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాఠశాల, మండల స్థాయి లో పంచాయతీరాజ్, వ్యవసాయ, అటవీ శాఖ, పలు ఎన్జీవోలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమాలు 7 వర్కింగ్ డేస్‌లో నిర్వహించనున్నారు. వీలును బట్టి ప్రతి రోజూ 30 నిమిషాల నుంచి గంట పాటు రోజుకో కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు తెలుసుకుంటున్నారు. చేపట్టిన కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను https://merilife.nic.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒక్కో విద్యార్థి ఒక మొక్క..
ప్రతి ఏడాదీ హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల్లో నాటిన మొక్కల అలనాపాలన చూసేవారు లేకపోవడంతో చెట్లు ఎదగడం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిక్షణకు కసరత్తు మొదలు పెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, కాపాడేలా ఉపాధ్యాయులు విద్యార్థుల ను ప్రోత్సహిస్తున్నారు.
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 15న : ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడంపై
అవగాహన…
ఈ నెల 18న : స్థిరమైన ఆహార వ్యవస్థను
అవలంభించడం
ఈ నెల 19న: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గించడం
ఈ నెల 20న: వ్యర్థ పదార్థాలను తగ్గించడం
ఈ నెల 21న: ఇంధన శక్తి వనరులను సంరక్షించడం
ఈ నెల 22న: నీటి వనరులను సంరక్షించడం
ఈ నెల 24న: సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను అరికట్టడం
విద్యార్థులకు ఎంతో ఉపయోగం..
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేం దుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే ప్రధానోపాధ్యాయులందరికీ వివరించాం. 7 వర్కింగ్ డేస్‌లో ఈ కార్యక్రమం చేపడతాం. ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశాలు అందాయి.
విజయకుమారి, డీఈఓ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా