పథకాల అమలు గ్రామస్థాయి నుండే జరగాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

– అధికారులు ప్రజలకు అవసరమైన పనులనే చేయాలి 
– అనధికారికంగా విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తాం
– ప్రజాసంఘాలు.. మీడియాను పరిగణలోకి తీసుకొని ముందుకు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గ్రామస్థాయి నుండే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాల్సిన అవసరం ఉందని, ఇందుకుగాను  ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామస్థాయిలో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి  మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వచ్చే సోమవారం నుండి నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో  విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి హామీ, ప్రజా పాలన తదితర అన్ని పథకాలు సరైన విధంగా లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత గ్రామ, మండల స్థాయి టీములపై ఉందని అన్నారు. అభివృద్ధి పథకాలపై అధికారులు  అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పథకం కింద టార్గెట్ తో పాటు, పెండింగ్ లబ్ధిదారులు, వారి జాబితాను ప్రత్యేకంగా రూపొందించాలని, అలాగే మండల స్థాయి టీములు  గ్రామ స్థాయి టీములను పర్యవేక్షించాలని, రాబోయే రోజుల్లో ఆయా పథకాల వారీగా సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయి బృందాలను  ఆశా వాద దృక్పథంతో తీర్చిదిద్దాలని శానిటేషన్, విద్య సక్రమంగా నడిచేలా చూడడం, అంగన్వాడి ద్వారా పౌష్టికాహారం అందించడం, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందించే సేవలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం, ఇతర విషయాలు, ఉపాధి హామీ పనులు, గ్రామాలలో విద్యుత్ సమస్యలు,  వంటి అంశాలపై గ్రామస్థాయిలో పూర్తి సంతృప్తికరంగా పనిచేయాలని, అలాగే  మున్సిపాలిటీలలో సైతం ఈ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  ఇందుకు గ్రామ స్థాయి  యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని అన్నారు.  అధికారులు పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని,ఉద్యోగులు ఎవరైనా అనధికారికంగా విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేయడం జరుగుతుందని  హెచ్చరించారు. నిబంధనలకు అనుకూలంగా ఉన్న పనులు చేయాలని, ప్రజలతో మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలని, అలాగే ప్రజాప్రతినిధులను కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా సంఘాలు, మీడియాను సైతం పరిగణలో తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులను చేపట్టడం జరిగిందని ఈ పనులపై శుక్రవారం నుండి ప్రతిరోజు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లతో సమీక్షిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.