వాస్తవ సంఘటనల ప్రేరణతో నింద

వాస్తవ సంఘటనల ప్రేరణతో నిందవరుణ్‌ సందేశ్‌ హీరోగా ‘నింద’ చిత్రం రాబోతోంది. ఈ మూవీని ది ఫెర్వెంట్‌ ఇండీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ జగన్నాథం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 21న రిలీజ్‌ కానుంది. మైౖత్రీ మూవీస్‌ ఈ సినిమాను నైజాంలో రిలీజ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత రాజేష్‌ జగన్నాథం మీడియాతో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు. మాది నర్సాపురం. చదువుల కోసం నెల్లూరు, చెన్నై, యూఎస్‌ అంటూ తిరిగాను. యూఎస్‌లోనే ఉద్యోగం చేస్తూ ఉండిపోయాను. ఫిల్మ్‌ మేకింగ్‌ మీద ఇంట్రెస్ట్‌ ఉండేది. అక్కడే ఫిల్మ్‌ మేకింగ్‌లో కోర్సులతోపాటు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాను. ఓ షార్ట్‌ ఫిల్మ్‌కి అవార్డు కూడా వచ్చింది. నేను రాసుకున్న ‘నింద’ కథ వరుణ్‌ సందేశ్‌కి బాగా సెట్‌ అవుతుందని నమ్మాను. ఆయనకు ఇది మంచి కమ్‌ బ్యాక్‌లా ఉంటుందని భావించాను. కాండ్రకోట మిస్టరీ అని నింద పోస్టర్‌ని రిలీజ్‌ చేసినప్పుడు అందరూ ఘోస్ట్‌ మీద సినిమా అని రాశారు. సర్లే ఏదో ఒకటి రాశారు. ప్రమోషన్‌ కల్పిస్తున్నారని అనుకున్నాను. టీజర్‌ రావడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో రియల్‌ ఇన్సిడెంట్స్‌ను బేస్‌ చేసుకుని కొన్ని సీన్లు రాసు కున్నాను. కల్పితం కూడా ఉంటుంది. కథపై నాకు నమ్మకం ఉంది. నిర్మాతల కోసం ప్రయత్నించాను. వేరే వాళ్లు ఎందుకు? నా సినిమాను నేను నిర్మించాలని అనిపించింది. అందుకే నిర్మాతగానూ మారాను. మా నాన్న కూడా ఈ ప్రాజెక్ట్‌ విషయంలో బాగా హెల్ప్‌ చేశారు. నా కథకి వరుణ్‌ సందేశ్‌తోపాటు మిగిలిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరూ పూర్తి న్యాయం చేశారు. అవుట్‌ఫుట్‌ చాలా బాగా వచ్చింది. సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా నాకు దర్శకుడినే కాకుండా నిర్మాతగానూ మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది.