ఫైనల్లో ముచోవ

– రెండో సీడ్‌ సబలెంక ఔట్‌
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
పారిస్‌ (ఫ్రాన్స్‌) : అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి, చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ కరొలినా ముచోవ అద్భుతం చేసింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌, టైటిల్‌ ఫేవరేట్‌ ఆర్యన సబలెంక (బెలారస్‌)పై ఉద్విగ విజయం సాధించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించి కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.43 కరొలినా ముచోవ 7-6(7-6), 6-7(5-7), 7-5తో మూడు సెట్ల ఉత్కంఠ మ్యాచ్‌లో సబలెంకపై విజయం సాధించింది. మూడు గంటల 13 నిమిషాల పాటు సాగిన మారథాన్‌ పోరులో సబలెంక వరుస గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల ఆశలకు తెరపడింది. తొలి రెండు సెట్లు టైబ్రేకర్లకు దారితీయగా తొలి సెట్‌ను ముచోవ గెలుపొందగా.. రెండో సెట్‌ను సబలెంక సొంతం చేసుకుంది. దీంతో క్వార్టర్‌ఫైనల్‌ ముచ్చటగా మూడో సెట్‌కు దారితీసింది. నిర్ణయాత్మక సెట్‌లో 7-5తో పైచేయి సాధించిన ముచోవ కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆరు ఏస్‌లు సంధించిన ముచోవ.. ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. మరోవైపు సబలెంక నాలుగు బ్రేక్‌ పాయింట్లు మాత్రమే సాధించింది. పాయింట్ల పరంగా ముచోవ 126-115తో సబలెంకపై పైచేయి సాధించింది. ముచోవ 20 గేములు నెగ్గగా, సబలెంక 18 గేములు సాధించింది. ముచోవ 38 విన్నర్లు కొట్టగా, సబలెంక 44 విన్నర్లతో మెరిసింది. ముచోవ 27 అనవసర తప్పిదాలతో సరిపెట్టగా.. 53 అనవసర తప్పిదాలతో సబలెంక ఓటమిపాలైంది.
సెమీస్‌లో రూడ్‌ : పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి కాస్పర్‌ రూడ్‌ (నార్వే) అడుగుపెట్టాడు. డెన్మార్క్‌ ఆటగాడు, ఆరో సీడ్‌ హోల్గర్‌ రూనెతో క్వార్వర్‌ఫైనల్లో రూడ్‌ 4-1తో గెలుపొందాడు. 6-1, 6-2, 3-6, 6-3తో కాస్పర్‌ రూడ్‌ సెమీఫైనల్లోకి చేరుకున్నాడు. ఐదు ఏస్‌లు సంధించిన రూడ్‌.. ఐదు బ్రేక్‌ పాయింట్లతో రూనెపై ఆధిపత్యం చెలాయించాడు. రూడ్‌ 21 గేములతో రెచ్చిపోగా.. రూనె 12 గేములతోనే సరిపెట్టుకున్నాడు. ఇక నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో కాస్పర్‌ రూడ్‌ తలపడనున్నాడు. మరో సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ అల్కరాజ్‌ గార్ఫియాతో మూడో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ పోటీపడనున్నాడు.