నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఎఫ్ టియు) ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా బాకీ ఉన్న పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిచ్ పల్లి ఎంపీడీవో కార్యాలయంలో వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సుపరింటెండెంట్ నివేదిత రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా (ఎఫ్ టియు) జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ గ్రామాలను పరి శుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల శ్రమ ఉందని, కానీ వారి శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ వారి శ్రమను దోస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎవరైనా కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, రవి, ప్రభాకర్, మహేష్ ,మోహన్, బాలు తదితరులు పాల్గొన్నారు.