సంపన్న దేశాల్లోకెల్లా బ్రిటన్‌లోనే అత్యధిక ద్రవ్యోల్బణం

– ఓఈసీడీ అంచనా
లండన్‌: అభివృద్ధి చెందిన దేశాల్లో కెల్లా బ్రిటన్‌లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం రేటు నెలకొనగలదని ఓఈసీడీ ఎకనామిక్‌ గ్రూపు అంచనా వేసింది. 2023లో దాదాపు 7శాతంగా సగటు ద్రవ్యోల్బణం రేటు వుంటుందని ఊహించింది. ఇది జీ-7 దేశాల్లో కెల్లా అధికం. సంపన్న దేశాల్లో కెల్లా బ్రిటన్‌లోనే అత్యధిక ద్రవ్యోల్బణం వుందంటే అది ప్రభుత్వ వైఫల్యమేనని లేబర్‌ పార్టీకి చెందిన షాడో ఆర్థిక మంత్రి జేమ్స్‌ ముర్రే వ్యాఖ్యానించారు. కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ ద్రవ్యోల్బణం కారణంగా మన ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా బలహీనపడిందని అన్నారు. 13ఏళ్ళ పాటు టోరీల ఆర్థిక నిర్వహణా లోపమే ఇందుకు కారణమని ముర్రే విమర్శించారు. జి-7 దేశాల్లో అత్యధిక సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు లేబర్‌ పార్టీ ప్రతిపాదిస్తున్న చర్యలు మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, మరింత భద్రతగా మారుస్తుందని, టోరీల వైఫల్యానికి ప్రజలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వుండదని అన్నారు. లేబర్‌ మార్కెట్‌లో ప్రాతినిధ్యం తగ్గడం, ఇంధన ధరలు, సరఫరా చెయిన్లలో విస్తృత అంతరాయాలు ఈ పరిస్థితికి కారణమని ఓఈసీడీ గ్రూపు ప్రధాన ఆర్థికవేత్త క్లారె లాంబార్డెల్లి చెప్పారు.