అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌లోకి భారత వ్యోమగామి

– రోదసీ రంగంలో భారత్‌, అమెరికా
– సహకార విస్తరణ నాసా చీఫ్‌ వెల్లడి
వాషింగ్టన్‌ : రోదసీ రంగంలో భారత్‌తో సహకారాన్ని అమెరికా రోదసీ సంస్థ విస్తరిస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ చెప్పారు. అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌కు భారత వ్యోమగామిని తీసుకువెళ్ళడానికి సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా, భారత్‌ జాతీయ భద్రతా సలహాదారులు జేక్‌ సులివాన్‌, అజిత్‌ దోవల్‌ సోమవారం ఐసెట్‌ డైలాగ్‌ చర్చలు జరిపిన నేపథ్యంలో ఇరు దేశాలు కలిపి ఫ్యాక్ట్‌ షీట్‌ను విడుదల చేశాయి. ఆ తర్వాత నెల్సన్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అమెరికాలో ఇస్రో వ్యోమగాములకు మరింత అధునాతనమైన శిక్షణ ప్రారంభించే దిశగా తాము కృషి చేస్తున్నట్లు అజిత్‌ దోవల్‌ చెప్పారు. గతేడాది భారత్‌లో నెల్సన్‌ పర్యటించారు. మానవాళి ప్రయోజనాల కోసం కీలకమైన, కొత్తగా ఆవిర్భవించే సాంకేతికతలపై అమెరికా, భారత్‌ చొరవను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నాసా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇరు పక్షాలు కలిసి రోదసీ రంగంలో పరస్పరం సహకారాన్ని విస్తరించుకుంటాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అయితే ఐఎస్‌ఎస్‌కు భారత వ్యోమగామిని తీసుకెళ్ళే మిషన్‌కు సంబంధించి ఇంకా వివరాలన్నీ ఖరారు చేయాల్సి వుందన్నారు. భవిష్యత్తులో మానవాళి జీవితం మరింత మెరుగుపరిచేందుకు ఈ ప్రయత్నాలన్నీ ఉపకరిస్తాయన్నారు.
నాసా-ఇస్రో సింథటిక్‌ అపెర్చూర్‌ రాడార్‌ను ప్రారంభించేందుకు కూడా ఇరు దేశాల రోదసీ సంస్థలు సిద్ధమవుతున్నాయని దోవల్‌, సులివాన్‌ చెప్పారు. కృత్రిమ మేథస్సు, సెమీ కండక్టర్‌, కీలకమైన ఖనిజాలు, అడ్వాన్స్‌డ్‌ టెలికమ్యూనికేషన్‌, రక్షణ, రోదసీ రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించేందుకు పలు చొరవలను కూడా ఇరువురు నేతలు చేపట్టారు.