ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

– విద్యాశాఖ కమిషనర్‌కు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పదోన్నతులు, బదిలీలు పొందుతూ అనేక రకాల సాంకేతికంగా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనను గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కలిసి వినతిపత్రం సమర్పించారు. పదోన్నతుల కౌన్సెలింగ్‌లో ఒకటి కంటే ఎక్కువ పదోన్నతులు పొందడం వల్ల మిగిలిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను అర్హులైన సెకండరీ గ్రేడ్‌ టీచర్లతో ప్రస్తుత కౌన్సెలింగ్‌లోనే పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రాథమిక విద్య బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకూ గతంలో మంజూరు చేసిన ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులను అర్హలైన డీఎడ్‌ లేదా బీఎడ్‌ అర్హతలు కలిగిన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించే విధంగా 12 జీవోను సవరించాలని సూచించారు. గతంలో పరస్పర బదిలీలపై వెళ్లిన వారికి కూడా అవకాశం కల్పించడానికి కటాఫ్‌ తేదీని వచ్చేనెల 30కి మార్చాలని కోరారు. ప్రభుత్వ అనుమతితో పరిశీలిస్తామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, కె రత్నాకర్‌రావు, సూరినేని గంగాధర్‌, కొండేటి శ్రీనివాస్‌రెడ్డి, జి రవీందర్‌గౌడ్‌, రాజు జాదవ్‌, మన్నె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.