– ఈ ఏడాది కొత్తగా 16లో అడ్మిషన్లు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 495 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. గత విద్యాసంవత్సరంలో 20 కొత్త కేజీబీవీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న మహమ్మదాబాద్ మండలంలో గండీడ్, సంగారెడ్డి జిల్లాలో ఉన్న మోగుదాంపల్లి మండలంలో హోతి కె, గుమ్మడిదల మండలంలో జిన్నారం, చౌటుకూర్ మండలంలో పుల్కల్‌లో గత విద్యాసంవత్సరంలో ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు ప్రవేశాల ప్రక్రియను నిర్వహించారు. మిగిలిన 16 కేజీబీవీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు ప్రవేశాలను కల్పిస్తారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017-18 విద్యాసంవత్సరంలో కొత్తగా 84 కేజీబీవీలను ప్రభుత్వం మంజూరుచేసింది. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కి చేరింది. 2023-24 విద్యాసంవత్సరంలో మరో 20 కేజీబీవీలు మంజూరు చేసింది. దీంతో వాటి సంఖ్య 495కు చేరింది. వాటిలో 245 కేజీబీవీల్లో ఇంటర్ వరకు, మిగిలిన 250 కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్యార్థినిలు చదువుతున్నారు. రాష్ట్రంలో 479 కేజీబీవీల్లో గత విద్యాసంవత్సరంలో 1,24,153 మంది అమ్మాయిలు విద్యనభ్యసించారు. రాష్ట్రంలో 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు (యూఆర్‌ఎస్) ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొత్తగా నాలుగు యూఆర్‌ఎస్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో వాటి సంఖ్య 33కు చేరింది. నారాయణపేట, ములుగు, రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్త యూఆర్‌ఎస్‌లు మంజూరయ్యాయి.
కొత్తగా ప్రవేశాలు కల్పించే కేజీబీవీలు…
మావల (ఆదిలాబాద్), బీర్‌పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్, మాసాయిపేట్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, వట్‌పల్లి (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్ధిపేట), చౌడాపూర్ (వికారాబాద్).