ఏర్పాటైన ఈజిప్ట్‌ సంక్షోభ విభాగం

ఏర్పాటైన ఈజిప్ట్‌ సంక్షోభ విభాగం– పెరుగుతున్న ‘హజ్‌’ మరణాల సంఖ్య
విపరీతమైన వేడి కారణంగా ముస్లింల మక్కా తీర్థయాత్రలో మరణాలు అధికమవు తున్నాయి. తమ పౌరులలో సంభవిస్తున్న సామూహిక మరణాలపై దర్యాప్తు చేయడానికి ఈజిప్టు గురువారం సంక్షోభ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు రాయిటర్స్‌ రిపోర్ట్‌ తెలిపింది. సౌదీ అరేబియాలో జూన్‌ 14 నుంచి 19 వరకు జరిగిన ‘హజ్‌’ యాత్రలో కనీసం 600 మంది ఈజిప్షియన్లు మరణించారని, అనేక మంది తప్పిపోయారని ఈజిప్ట్‌ జాతీయ మీడియా వైద్య, భద్రతా వర్గాలను ఉదహరిస్తూ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని తెలిపింది. ఈ తీర్థయాత్రలో ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలమంది యాత్రికులు పాల్గొన్నారు.
చాలా మంది బాధితులు తీర్థయాత్రకు అధికారికం నమోదు చేసుకోలేదని ఈజిప్టు ప్రతినిధి బందంలోని వైద్యులు పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌ అబ్దెల్‌ ఫట్టా అల్‌-సిసి నుంచి వచ్చిన ఆర్డర్‌ను అనుసరించి సంక్షోభ యూనిట్‌ను ప్రారంభించింది. తర్వాత అధికారికంగా నమోదైన 50,752 మంది ఈజిప్షియన్‌ యాత్రికుల సమూహం నుంచి 28 మరణాలను ఈజిప్ట్‌ క్యాబినెట్‌ ధవీకరించింది. నమోదుకాని యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేసే సంస్థలపై విచారణ జరిపి జరిమానా విధిస్తామని మంత్రివర్గం పేర్కొంది. ప్రతి యేటా వందలు, వేల మంది యాత్రికులు అధికారిక అనుమతులు పొందలేక అనధికారిక మార్గాల ద్వారా హజ్‌ యాత్రకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇప్పటివరకు ఈ వార్షిక తీర్థయాత్రలో మొత్తం 1,081 మరణాలను 10 దేశాలు ప్రకటించాయని అరబ్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. సౌదీ అరేబియాలోని వాతావరణ కేంద్రం సోమవారం మక్కాలోని గ్రాండ్‌ మసీదు వద్ద 51.8 డిగ్రీల సెల్సియస్‌ (125 డిగ్రీల ఫారెన్‌హీట్‌) గరిష్ట ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొంది. జియోఫిజికల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌ జర్నల్‌లో ప్రచురించబడిన 2019 అధ్యయనం ప్రకారం, వాతావరణ మార్పుల కారణంగా, హజ్‌ యాత్రికుల వేడి ఒత్తిడి 2047, 2052 మధ్య ”అత్యంత ప్రమాదకరమైన పరిధి”ని అధిగమిస్తుందని, 2079 నుంచి 2086 వరకు, శతాబ్దమంతా దాని తీవ్రత పెరుగుతూనే ఉంటుందని వెల్లడించింది.