ప్రయివేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. ఫీజులు, డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అవి పట్టించుకోవడంలేదు. విచ్చలవిడిగా లక్షల రూపాయలను ఫీజుగా తీసుకుంటున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను విక్రయించొద్దని నిబంధనలున్నా అనేక పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ వాటిని అమ్ముతున్నారు. ప్యాకేజీల రూపంలో ఎల్‌కేజీ నుంచి యూకేజీ వరకు రూ.7వేలు, ఆ పై తరగతులకు రూ.10 వేలపైనే ముక్కుపిండి దండుకుంటున్నారు. ఈ దోపిడీపై సర్వత్రా ఆరోపణలొస్తున్నా కట్టడి మాత్రం జరుగడంలేదు. 2023-24కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజలు భారీగా పెంచనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే 6 నుంచి 20 శాతం వరకు పెంచే ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఇంకా ముగియకముందే వచ్చే ఏడాదికి కట్టాల్సిన స్కూల్ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ మెసెజ్‌లు, నోటీసులు, మెయిల్స్ పంపడం గమనార్హం. విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 121సీ ప్రకారం.. ప్రయివేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు చట్టం అమలెందుకు కాలేదని ఇటీవల హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం-2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని అడిగింది. చట్టం అమలు చేస్తే ఆ వివరాలను ఎందుకు అందజేయలేదని నిలదీసింది.
ప్రత్యేకరాష్ట్రంలోనూ దయనీయమే…
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువరానిది. అయితే ఉద్యమంలో కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో నిస్వార్థ కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది.రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులున్నారు. ఈ లెక్కన సగటున ఒక పాఠశాలకు కేవలం ఏడుగురు టీచర్స్ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలుండగా కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి.
తాగేందుకు మంచినీళ్లూ కరువే…
మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ విషయానికి వస్తే… కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి. టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్‌లో ఆన్‌లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, ఇతర సరిపడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలం గాణ’, ‘వెండి తెలంగాణ’ అని గత ప్రభుత్వంలా కబుర్లు చెప్పకుండా… అన్ని విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్టు అవుతుంది.
బ్యాగులు, షూలు..అన్నీ భారమే..
మార్కెట్‌లో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు బ్యాగులు, వాటర్ బాటిళ్లు, షూస్, ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరడగం తల్లిదండ్రులకు భారంగా మారింది. తోటి పిల్లలు రకరకాల వస్తువులు తెచ్చుకుంటే తమ పిల్లలలకు ఏది తక్కువ కాకూడదన్న భావించే తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులు ఖరీదు ఎంతైనాసరే కొనుగోలు చేసి ఇస్తున్నారు. మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో దాని ప్రభావం కుటుంబాలపై పడుతోంది. పాఠశాలల యాజమాన్యలు పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు బ్యాగులను కూడా తమ వద్దనే కొనాలనే నిబంధలు విధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో అక్కడే కొనాల్సి వస్తుంది.నిబంధనల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఆ విద్యా ర్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తున్న పాఠశాలలు చాలా తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించి పోతున్నారు.బండెడు పుస్తకాల బరువు మోయలేక పిల్లలు అలవికాని రోగాల బారి నపడుతున్నారు. ఇంతకుముందు 2015లో కూడా బ్యాగుల బరువు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా ఆ ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదు. కానీ గత మేలో మద్రాస్ హైకోర్టు పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు నియంత్రణపై ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ స్కూలు బ్యాగుల బరువు తగ్గించే చర్యలు చేపట్టింది. అయితే ‘ఆదేశాలు ఇచ్చాం మా పని అయిపోయింది’ అని కాకుండా కచ్చితమైన వ్యవస్థను ఏర్పాటు చేసి అమలులోకి తేవాల్సిన అవసరం ఉన్నది.
డా. నర్రా సుఖేందర్ రెడ్డి
జీహెచ్ఎంసీ అధ్యక్షులు, విద్యార్థులు రాజకీయ పార్టీ
9394000030