ఇన్‌సైడర్‌

‘తెల్లనివన్నీ పాలు కాదు…చెప్పెవన్నీ నిజాలు కావు’ అనే నానుడి సాధారణంగా వినే ఉంటాం. ఇది కచ్చితంగా రాజకీయ నాయకులకు సరిపోతుంది. పైకి బల్లగుద్ది చెప్పినా…లోపల రాజకీయం ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. ఎన్నికల్లోనైతే అంతు పట్టని ఎత్తులు వేస్తారు. అది జరిగాక ముక్కమీద వేలుసుకుంటాం. కానీ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం అంతుచిక్కని విధంగా ఉంటుంది. ప్రజలకు ఎన్ని ఉపన్యాసాలు దంచినా, రాజకీయ శత్రువు నిర్మూలన పక్కా వ్యూహత్మంగా చేస్తుందని పేరుంది. కాలం కలిసి రాక, బీజేపీ ప్రమాదాన్ని గుర్తించక బొక్కబోర్ల పడింది కానీ ముందు చూపు ఉంటే బీజేపీని తొక్కిపెట్టేందని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ అప్పట్లో రాజకీయ సంచలనంగా మారిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్‌తో విభేదించి తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ను వ్యతిరేకించడమంటే సాదాసీదా విషయం కానేకాదు. అటువంటిది మర్రి చెన్నారెడ్డి పెద్ద తుర్రుంకాడు అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలిస్తున్న వారి కోసం త్యాగధనుడిగా నిలబడ్డాడు అని వేనోళ్ల పొగిడారు. దీని వెనకాల ఇన్‌సైడర్‌ ఇందిరా గాంధీ అన్ని అప్పట్లో ఎవరికి తెలియదు. ఇందిరాగాంధీ, మర్రి చెన్నారెడ్డి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌పై ఆయన తిరుగు బాటు జెండా ఎగురవేశారని తర్వాత తెలిసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పెట్టి పదహారు మంది ఎంపీలు గెలువగానే కాంగ్రెస్‌లో కలిపారు. ఆ తర్వాత తెలంగాణ కల సాధించేం దుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుచేసిన కేసీఆర్‌… ఉద్యమ పార్టీ అని చెప్పి నమ్మించి, రాష్ట్రం ఏర్పడగానే దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు.మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి రైతు సంక్షే మం కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు కలరింగ్‌ ఇచ్చారు. కానీ ఇన్‌సైడర్‌ అది కాదు. తన వయసు అయిపోతుంది. కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి పుత్రోత్స వాన్ని చాటుకునేందుకు హస్తం గూటికి చేరాడు. రాజకీయాల్లో ఒక్కొక్క ఘటన వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. లోతుగా పరిశీలిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి.
– గుడిగ రఘు