విండీస్‌ రేసులోనే!

విండీస్‌ రేసులోనే!– అమెరికాపై 9 వికెట్ల తేడాతో గెలుపు
– రాణించిన హోప్‌, రోస్టన్‌ ఛేజ్‌
– అమెరికా 128/10, వెస్టిండీస్‌ 130/1
గ్రూప్‌ దశ మ్యాచుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆతిథ్య అమెరికా (యుఎస్‌ఏ) సూపర్‌8లో అగ్ర జట్ల ముందు నిలువలేకపోతుంది!. తొలుత దక్షిణాఫ్రికా, ఇప్పుడు వెస్టిండీస్‌లు అమెరికాపై అలవోక విజయం సాధించాయి. సూపర్‌8లో రెండు పరాజయాలు చవిచూసిన అమెరికా సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో సఫారీ చేతిలో ఓడినా.. అమెరికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆతిథ్య వెస్టిండీస్‌ సెమీస్‌ రేసులో నిలిచింది.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసులో ఆతిథ్య వెస్టిండీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకుంది. సూపర్‌8 గ్రూప్‌-2లో శనివారం అమెరికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కరీబియన్లు నెట్‌రన్‌రేట్‌ను సైతం భారీగా మెరుగుపర్చుకున్నారు. స్వల్ప ఛేదనలో ఓపెనర్‌ షారు హోప్‌ (82 నాటౌట్‌, 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 10.5 ఓవర్లలోనే వెస్టిండీస్‌ లాంఛనం ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్‌ రోస్టన్‌ ఛేజ్‌ (3/19), పేసర్‌ ఆండ్రీ రసెల్‌ (3/31) మూడేసి వికెట్ల మ్యాజిక్‌తో అమెరికాను వణికించారు. యుఎస్‌ఏ తరఫున ఆండ్రియస్‌ గౌస్‌ (29, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ (20, 19 బంతుల్లో 2 ఫోర్లు), మిలింద్‌ కుమార్‌ (19, 21 బంతుల్లో 1 ఫోర్‌) రెండెంకల స్కోరుతో ఆదుకున్నారు. మూడు వికెట్ల మాయ చేసిన రోస్టన్‌ ఛేజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
హోప్‌ ధనాధన్‌ : 129 పరుగుల ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ షారు హోప్‌ (82 నాటౌట్‌) విశ్వరూపం చూపించాడు. ఎనిమిది సిక్సరుల, నాలుగు ఫోర్లతో అమెరికా బౌలర్లను దంచికొట్టాడు. మరో ఓపెనర్‌ జాన్సన్‌ చార్లెస్‌ (15, 14 బంతుల్లో 2 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. హోప్‌ దూకుడు చూపించాడు. పవర్‌ప్లేలో విండీస్‌ 58 పరుగులే చేసినా.. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 26 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన హోప్‌ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. నికోలస్‌ పూరన్‌ (27 నాటౌట్‌, 12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) సైతం రాణించాడు. 10.5 ఓవర్లలోనే 130 పరుగులు చేసిన వెస్టిండీస్‌ మరో 55 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది.
అమెరికా విలవిల : టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన అమెరికాను విండీస్‌ బౌలర్లు విలవిల్లాడించారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ స్టీవెన్‌ టేలర్‌ (2)ను అవుట్‌ చేసిన రసెల్‌.. యుఎస్‌ఏ పతనానికి నాంది పలికాడు. ఆండ్రియస్‌ గౌస్‌ (29), నితీశ్‌ కుమార్‌ (20) రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించటంతో అమెరికా కష్టాలు ఎక్కువయ్యాయి. స్పిన్నర్‌ రోస్టన్‌ ఛేజ్‌ వరుసగా వికెట్లు పడగొట్టి అమెరికాను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆరోన్‌ జోన్స్‌ (11), కోరే అండర్సన్‌ (7), హర్మీత్‌ సింగ్‌ (0) నిరాశపరిచారు. మిలింద్‌ కుమార్‌ (19), వాన్‌ (18), అలీ ఖాన్‌ (14)లు అమెరికాకు మూడెంకల స్కోరు అందించగలిగారు. 19.5 ఓవర్లలో 128 పరుగులకే అమెరికా కుప్పకూలింది. రసెల్‌, ఛేజ్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.